భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 19 (నమస్తే తెలంగాణ):ఎండలు ముదురుతున్న వేళ అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు తాళలేకపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఆ వేడికి అల్లాడిపోతున్నారు. ఉదయం పది గంటలకే ఎండలు పెరుగుతుండడంతో పిల్లలు కేంద్రాలకు రావాలంటే జంకుతున్నారు. విద్యాశాఖ ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఒంటిపూట బడులను ప్రారంభించిన విషయం విదితమే. కానీ, అంగన్వాడీ కేంద్రాలు మాత్రం సాయంత్రం నాలుగు గంటల వరకు నడుస్తుండడంతో పిల్లలు మధ్యాహ్నం సమయంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఉండలేకపోతున్నారు. ఆ సమయంలో కనీసం ఆ కేంద్రాల్లో చల్లని తాగునీరు కూడా లేకపోవడంతో దాహార్తితో తల్లడిల్లిపోతున్నారు. అవకాశమున్న వారు మాత్రమే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు. ఇంట్లో కూడా చల్లని నీరు లేనివారు అంగన్వాడీ కేంద్రాల్లోని వేడి నీటినే తాగుతున్నారు.
పట్టణ ప్రాంతాల్లో మరీ..
గ్రామీణ ప్రాంతాల్లో సొంత భవనాలు ఉన్నచోట కొంత ఫర్వాలేదనుకున్నా.. అద్దె భవనాల్లో కొనసాగే ఇరుకు గదుల్లో ఉండే పిల్లలు చాలా అవస్థలు పడుతున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఉండే చిన్న గదుల్లో చిన్నారులు మరింత అవస్థ పడుతున్నారు. ఆయా గదుల్లో ఆడుకోవడమూ, పడుకోవడమూ కష్టంగా ఉంటున్నాయి. ఇదే సమయంలో ఈ గదుల్లో మధ్యాహ్నం వేళ ఎండ వేడిమి అధికంగా ఉండడంతో గదులు వేడుక్కుతున్నాయి. ఫలితంగా పిల్లలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఎండను తాళలేకపోతున్నారు.
అంగన్వాడీలకు ఒంటిపూట బడులు పెట్టాలి..
అంగన్వాడీ కేంద్రాల్లో ఉండేది అసలే చిన్న పిల్లలు. మధ్యాహ్నం వేళ ఎండ సమయంలో ఇబ్బంది పడుతున్నారు. ఇరుకుగదులు ఉన్న చోట ఉక్కపోతకు గురవుతున్నారు. ఎండకు తమ పిల్లలు ఉంటున్నారోనని తల్లిదండ్రులు కూడా ఆందోళనపడుతుంటారు. అందుకని, అంగన్వాడీ పిల్లలకు కూడా ఒంటిపూట బడులు పెట్టాలి.
-పద్మ, సీఐటీయూ నాయకురాలు