ఖమ్మం సిటీ, జులై 25: ఖమ్మం సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అక్కడ పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆదేశానుసారం గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ యంత్రాంగం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ దిశగా హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అవసరమైన రిజిస్ట్రేషన్ కేంద్రాలు, శాంపిల్ కలెక్షన్స్ కేంద్రాలు, ఉద్యోగులను పరీక్షించే నిమిత్తం అవసరమైన వైద్యులను అందుబాటులో ఉంచారు. అక్కడకు వచ్చిన ప్రతి ఉద్యోగిని వైద్యులు పరీక్షించి వారి మెడికల్ హిస్టరీ తెలుసుకుని అవసరమైన వైద్య పరీక్షలు చేశారు.
సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్), హిమోగ్లోబిన్, రక్త కణాల సంఖ్య, తెల్ల రక్త కణాల వివరాలను, ఆర్బీఎస్ (షుగర్ స్థాయి), ఎల్ఎఫ్టీ (కాలేయ పనితీరు), ఆర్ఎఫ్టీ (కిడ్నీల పనితీరు), థైరాయిడ్ ప్రొఫైల్, లిఫిడ్ ప్రొఫైల్, ఈసీజీ, కాల్షియం, బీ 12, డీ 3 వంటి పరీక్షలు చేశారు. ఫలితాల వివరాలను వారి మొబైల్ ఫోన్‌కు పంపించి, పాటించాల్సిన డైట్ వివరాలు, చేయాల్సిన మెడిటేషన్, వాడాల్సిన మందుల వివరాలను సంబందిత వైద్య నిఫుణులతో సూచించనున్నారు. ప్రత్యేక వైద్య శిబిరానికి 287 మంది పురుష, 140 మంది మహిళా ఉద్యోగులు హాజరయ్యారు.
వీరిలో 102 మందికి మధుమేహం, బీపీ, 85 మందికి ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. మరో 346 మందికి వివిధ వైద్య పరీక్షల నిమిత్తం రక్త నమూనాలు సేకరించారు. కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ స్వయంగా పర్యవేక్షించడంతోపాటు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం ప్రజలకు సేవలు అందించే ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసమే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బీ మాలతి, డీసీహెచ్ఎస్ డాక్టర్ కేసగాని రాజశేఖర్‌గౌడ్, వివిధ శాఖల అధికారులు, జిల్లా ఆసుపత్రి ఫిజీషియన్లు, గైనకాలజిస్ట్లు, వివిధ విభాగాల స్పెషలిస్ట్‌లు, వైద్యాధికారులు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.