భద్రాద్రి కొత్తగూడెం, జూలై 15 (నమస్తే తెలంగాణ) : అసలే వ్యాధుల కాలం.. ఓవైపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు పారిశుధ్యలోపంతో వ్యాధులు ముసురుకుంటున్నాయి. దానికితోడు అనుకోని వ్యాధులు, ఆకస్మిక ఘటనలు, మరెన్నో ప్రమాదాలు.. వెరసి ప్రభుత్వాసుపత్రులకు రోజురోజుకూ రోగుల తాకిడి పెరుగుతోంది. ప్రస్తుత ప్రభుత్వంలోని సర్కారు వైద్యశాలల డొల్లతనం ఇక్కడే బయటపడుతోంది. అధికారంలోకి ఏడు నెలలు దాటినా ప్రస్తుత కాంగ్రెస్ పాలకులకు ప్రభుత్వాసుపత్రుల గురించి పట్టింపేలేకుండా పోయింది. దీంతో ఎన్నో ఆశలతో, మరెంతో ధైర్యంతో సర్కారు వైద్యశాల గడప తొక్కిన రోగులకు నిరాశే ఎదురవుతోంది. ముఖ్యంగా మందుల కొరత కారణంగా రోగులు, వారి కుటుంబీకులు చుక్కలు చూస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చొని వేచి చూసిన రోగులకు.. ‘ఇంకొన్ని మందు బిళ్లలు లేవు. బయట తీసుకోండి.’ అంటూ అక్కడి ఫార్మసీ సిబ్బంది చేస్తున్న సూచనలు అంతులేని ఆవేదనను మిగుల్చుతున్నాయి. ‘బయట కొనుక్కునే స్తోమతే ఉంటే మేము ఇక్కడిదాకా ఎందుకొస్తాం..’ అని నిట్టూర్చుకుంటూ ఒంట్లో సత్తువను కూడగట్టుకొని ప్రైవేటు మందులషాపు బాట పడుతున్నారు. ముఖ్యంగా భద్రాద్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలతోపాటు ఇతర ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక వైద్యశాలల్లో ఇటీవల కాలంలో ఈ దృశ్యాలు నిత్యకృత్యంగా కన్పిస్తున్నాయి.
వర్షాలు కురుస్తుండడం, వాతావరణంలో మార్పులు రావడం వంటి కారణాలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే సాధారణ సీజనల్ వ్యాధుల బాధితులతోపాటు మలేరియా, డెంగీ జ్వరాల పీడితులు కూడా మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర, ఏరియా ఆసుపత్రులకు వస్తున్నారు. అంతగా వ్యాధులతో బాధపడుతూ ఎన్నో ప్రయాసలకు ఓర్చి ప్రభుత్వాసుపత్రిదాకా వస్తే.. ఇక్కడి మందుల కొరత వారిని మరింత ముప్పుతిప్పలు పెడుతోంది.
‘ఉన్నవి కొన్ని రకాలే. మిగతావి కావాలంటే బయటకు వెళ్లండి.’ అంటున్నారు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి ఫార్మసీ సిబ్బంది. దీంతో దిక్కుతోచని స్థితి ఆ మందుల చీటీని పట్టుకొని ముక్కుతూ మూలుగుతూ బయటకు వెళ్తున్నారు ఆసుపత్రికి వచ్చిన రోగులు. సాక్షాత్తూ డీఎంఈ పరిధిలో ఉన్న జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉందంటే పరిస్థితి ఎంతటి స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘బీపీ, షుగర్ గోలీలు రెండు రకాలు తప్ప వేరేవి లేవు. బీపీ 40 ఎంజీ తప్ప మిగతావి కూడా లేవు. నాలుగు రకాల యాంటీ బయాటిక్ మాత్రల్లో రెండు రకాలు మాత్రమే ఉన్నాయి. అందుకే ఎవరికైనా అవే ఇస్తున్నాం.’ అంటున్నారు ప్రధానాసుపత్రి ఫార్మసీ సిబ్బంది. ఇక ఇన్ పేషెంట్లు ఆసుపత్రిలో చేరి వారం రోజులు వైద్య సేవలు పొందుతున్నా మందులు మాత్రం అన్ని రోజులకు సరిపడా ఎవరికి వారు బయట తెచ్చుకోవాల్సిన పరిస్థితి. రామవరం మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. జిల్లాలో 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు, 5 పీపీ యూనిట్లు, మరో 5 ఏరియా ఆసుపత్రులు, జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి అనుబంధంగా జనరల్ ఆసుపత్రి ఉన్నా.. అన్నింటిలోనూ మందుల కొరత సమస్య కామన్‌గానే ఉంది. చివరికి అజిత్రోమైసిన్, పాంటాప్రోజోల్, డైక్లో సహా మరికొన్ని మందుల కోసం ప్రభుత్వ వైద్యులిచ్చిన ప్రిస్కిప్షన్ పట్టుకొని బయట మందుల షాపులకు వెళ్లిన రోగులకు జేబులు గుల్లవుతున్నాయి.
భద్రాద్రి జిల్లా ఆసుప్రతిలో వెంటిలేటర్లది మరో ప్రధాన సమస్యగా ఉంది. మొత్తం ఇక్కడ పది వెంటిలేటర్లు ఉన్నాయి. కానీ వాటిల్లో రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. దీంతో సీరియస్ కేసులు వస్తే ఖమ్మం, వరంగల్ ఆసుపత్రులకు ఇక్కడి వైద్యులు రిఫర్ చేస్తున్నారు. గతంలో అందుబాటులో ఉన్న ఆక్సీజన్ ప్లాంట్ కూడా కూడా ఇప్పుడు మూతపడింది.
ఖమ్మం సిటీ, జూలై 15: ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన గత కేసీఆర్ సర్కారులో కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలందించిన ఖమ్మం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలు.. ఏడెనిమిది నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. పల్లె, బస్తీ దవాఖానలు మొదలుకొని కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, ఇంటింటికీ వైద్య పరీక్షలు, కంటి వెలుగు కార్యక్రమాలు సహా ఇత్యాది వైద్య సదుపాయాలతో గత కేసీఆర్ సర్కారులో ఆరోగ్య తెలంగాణ ఆవిష్కృతమైంది. కానీ ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి ఆనవాళ్లు లేకుండా చేస్తోంది.
ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో 30 పీహెచ్‌సీలు, 4 యూహెచ్‌సీలు, 161 పల్లె దవాఖానలు, 9 బస్తీ దవాఖానలు ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా సార్వజనీన ఆసుపత్రితోపాటు తిరుమలాయపాలెం, మధిర, వైరా, సత్తుపల్లి, పెనుబల్లి, నేలకొండపల్లి వైద్యశాలలు కొనసాగుతున్నాయి. నాటి కేసీఆర్ సర్కారు ఖమ్మం జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేయడంతో పెద్దాసుపత్రి డీఎంఈ పరిధిలోకి వెళ్లింది. ఆయా ఆసుపత్రుల్లో గుండె, కిడ్నీ, నరములు, సాధారణ ప్రసవాలతోపాటు ఎమర్జెన్సీ సేవలు సాధారణ పౌరులకు అందుబాటులోకి వచ్చాయి. కానీ ప్రజా పాలన పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వెనుకటి రోజులను పునరావృతం చేస్తోంది. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..’ అనే పరిస్థితిని తెచ్చింది. మరోవైపు జిల్లాలో సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారమే జిల్లాలో ప్రస్తుతం 9,024 మంది విష జ్వరాల బారిన పడ్డారు. వారిలో 195 మందికి డెంగీ పాజిటివ్‌గా తేలింది. జ్వరాల బారిన పడిన వారికి తక్షణ అవసరంగా అందించే ‘పారాసిటమాల్’ ఐఎం, ఐవీ ఇంజక్షన్లు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కడా లేవు. కడుపు నొప్పి, కడుపులో మంటకు, గ్యాస్టిక్ ప్రాబ్లమ్‌కు అవసరమైన ‘ర్యాన్టాక్, పాంటాప్’ మందులు అందుబాటులో ఉంటే ఒట్టు. విష జ్వరాలను గుర్తించే నిమిత్తం నిర్వహించేందుకు ఉపయోగించే వైద్య పరీక్షల కిట్లు కూడా అరకొరే. పైగా, దవాఖానలో కీలకమైన వైద్య పరీక్షలకు బాధితులను స్థానిక వైద్యులు బయటికి పంపించాల్సి వస్తోంది. పలు రకాల మందులు సైతం సరిపడా లేనందున డాక్టర్లు చీటీలు రాస్తే రోగులు బయట కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
జిల్లాలో మందుల కొరత లేదు. సీజనల్ జ్వరాలకు సంబంధించిన అన్ని రకాల మందులను ప్రభుత్వాసుపత్రులన్నింటికీ సరఫరాం చేశాం. ప్రతీ దవాఖానలో డెంగీ కిట్లు ఉన్నాయి. కానీ జ్వర తీవ్రత పెరిగితే వినియోగించాల్సిన పారాసిటమాల్ ఇంజక్షన్లు మాత్రం అందుబాటులో లేవు. ‘ర్యాన్టాక్, పాంటాప్’ మందులు నిండుకున్న మాట వాస్తవమే. ఆసుపత్రుల అభివృద్ధి నిధులు (హెచ్‌డీఎస్) కోసం ప్రతిపాదనలు పంపాం. తొందరలోనే ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేస్తుందని ఆశిస్తున్నాం.
మందుల కొరత లేదు. ప్రభుత్వం నుంచి వచ్చిన మందులను ఇస్తున్నాం. కొందరు రోగులు బయటకు రాయండని కోరుతున్నారు. అంతే తప్ప మేము బయటకు ఎవరికి రాయడం లేదు. వెంటిలేటర్ సమస్య ఉన్న మాట వాస్తవమే. మరమ్మతుల గురించి అధికారులకు తెలియజేశాం. త్వరలో సమస్యలు పరిష్కారమవుతాయి.
మా అమ్మకు కాలునొప్పి వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాను. రెండు రోజులు ఇక్కడే ఉన్నాం. ఆసుపత్రిలో అన్ని మందులూ లేవని చెప్పారు. మిగతావన్నీ బయట మెడికల్ షాపుల్లో కొనుక్కోమని చెప్పి చీటీ రాసిచ్చారు. ఆ చీటీ తీసుకొని బయట మందుల షాపుకు వెళ్తే అక్కడ రూ.2 వేల బిల్లు అయింది. ప్రభుత్వాసుపత్రిపై నమ్మకంతో ఇక్కడి దాకా వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. మందు బిళ్లలు బయటకు కొనుక్కునే పరిస్థితే అయితే ఇంత దూరం ప్రయాణించి సర్కారు దవాఖానకు ఎందుకు వస్తాం?
అన్ని మందులూ లేవని కాదు. కొన్ని మందులు రాలేదు. త్వరలోనే వస్తాయి. అందుకోసం ఇండెంట్ పెట్టాం. స్టోర్ ఖమ్మంలో ఉంది. ఏ ఆసుపత్రికి వచ్చినా అక్కడ నుంచే రావాలి. రాగానే అన్ని ఆసుపత్రులకు సరఫరా చేస్తాం. యాంటీ బయాటిక్స్ రెండు రకాలు ఉన్నాయి. మలేరియా మాత్రలు అందుబాటులో ఉన్నాయి.