కొత్తగూడెం టౌన్/ రామవరం, నవంబర్ 20: భద్రాద్రి జిల్లాలో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయాయి. దీంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా పగలూ రాత్రీ అనే తేడా లేకుండా జనం చలికి వణికిపోతున్నారు. ‘వామ్మో చలి..’ అంటూ ఉన్ని దుస్తులవైపు పరుగులు తీస్తున్నారు. నిన్నా మొన్నటి వరకు తుపాను ప్రభావం కన్పించగా.. ఇప్పుడు దానికి చలికాలం సీజన్ తోడైంది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి జిల్లా ప్రజలను గడగడలాడిస్తోంది.
కార్తీకమాసం కొనసాగుతున్న ఈ సమయంలో తెల్లవారుజామున నిద్రలేచే భక్తులు మరింతగా చల్లగా ఉన్న నీటితోనే స్నానాలు ఆచరిస్తున్నారు. ఇక కార్తీక పూజలు చేసే మహిళలు, వివిధ పనుల నిమిత్తం పయనం కావాల్సిన వృత్తిదారులు బయటకు రావాలంటే భయపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితి కావడంతో కాలు బయట పెడుతున్నారు. ఉదయం పది గంటల సమయం దాటినా చలి వాతావరణం తగ్గడం లేదు.
దీంతో చాలామంది ఇంటికే పరిమితమవుతున్నారు. కూలీలు, వ్యాపారులు మాత్రం తెల్లవారుజాము నుంచే పనులకు వెళ్లక తప్పడం లేదు. మరోవైపు తుపాను ప్రభావంతో పంట పొలాలు నీట మునగడంతో కూలీలు పొలాల వద్దకు వెళ్లి పొలం పనులు చేస్తున్నారు. చలిగాలులకు ప్రజలు దగ్గు, జలుబులతో ఆసుపత్రి పాలవుతున్నారు. వసతిగృహాల్లో ఉండే విద్యార్థులు చలికి అనేక ఇబ్బందులు పడుతున్నారు.
చలి ప్రభావం రెండు రోజులున్నా కన్పిస్తున్నప్పటికీ గడిచిన నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలకు తగ్గిపోయి నమోదవుతున్నాయి. రాత్రయితే రగ్గులు కప్పుకున్నా చలి ఆగడం లేదు. అయితే, ఈ నెల చివరి వరకు ఇవే ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం.
చలి ప్రభావంతో
చలి గాలుల తీవ్రత పెరగడంతో జిల్లా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో జనం బయటకు రావాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. కొందరైతే చలికోట్లు వేసుకున్నాకే బయట అడుగు పెడుతున్నారు. వాతావరణంలో ఒక్కసారిగా ఇలాంటి మార్పులు రావడంతో చిన్నారులు, వృద్ధులు జలుబు, దగ్గు, జ్వరం భారిన పడుతున్నారు. అయితే, చలికాలంలో ఆరోగ్యం విషయం మరిన్ని జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి గాలుల వేళ బయటకు రాకూడదని, న్యుమోనియో ఉన్నవాళ్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దగ్గు, జలుబు వంటివి రెండు రోజులైనా తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. అయితే, ఇవే లక్షణాలతో ఇప్పటికే ఆసుపత్రుల వద్ద రోగుల సంఖ్య పెరుగుతోంది.
చలికాలంలో పిల్లల ఆరోగ్యం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చలి తీవ్రత పెరుగుతున్నందున వారు తప్పకుండా ఉన్ని దుస్తులు ధరించేలా చూడాలి. చలిగాలులకు బయటకు తీసుకెళ్లకూడదు. పెద్దవాళ్లు, వృద్ధులు కూడా ఆరుబయట తిరిగే సమయాన్ని తగ్గించాలి. జలుబు, దగ్గు వంటివి తగ్గేందుకు కొంత సమయం పడుతుంది. ఇంట్లో అందరూ వేడి చేసి చల్లార్చిన నీటినే తగడం మంచిది. స్నానానికి కూడా వేడినీటినే ఉపయోగించాలి. ముఖ్యంగా రోగులు అనవసరంగా బయటకు రావొద్దు. మంచు కురుస్తున్న వేల మరింత జాగ్రత్తగా ఉండాలి.
-డాక్టర్ పుష్పలత, ఎండీ జనరల్ మెడిసిన్, కొత్తగూడెం