వెలుగు జిలుగుల దీపావళి పండుగను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు గురువారం ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి. ఉదయాన్నే ఇళ్ల ముంగిళ్లను శుభ్రం చేసి మామిడి తోరణాలు, అరటి ఆకులు, బంతిపూల మాలలతో ఆకర్షణీయంగా అలంకరించారు. ఇంటిల్లిపాదీ నదీ స్నానాలతోపాటు ఇళ్లలోనూ స్నానాలు ఆచరించి నూతన వస్ర్తాలు ధరించారు.
ఆలయాలకు వెళ్లి పూజలు చేయడంతోపాటు ఇళ్లలోనూ లక్ష్మీదేవిని ప్రత్యేకంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. దీపావళి పండుగ సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వెలుగుల పండుగ రోజు నుంచి అంతా మంచే జరగాలని వేడుకున్నారు. తమ వృత్తి, వ్యాపారాల్లో ఐశ్వర్యాలు సమకూరాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కులు చెల్లించుకున్నారు.
సాయంత్రం వేళ ఇళ్ల ఎదుట మహిళలు, యువతులు రంగవల్లులను తీర్చిదిద్ది.. ప్రమిదల్లో ఒత్తులు వేసి దీపాలు వెలిగించారు. వ్యాపార సముదాయాలను విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పిల్లలు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి పటాకులు పేల్చుతూ సంబురంగా గడిపారు. చిన్నారులైతే చిచ్చుబుడ్లు, కాకర పూవొత్తులు కాలుస్తూ సందడి చేశారు. వారి కేరింతలతో కుటుంబ సభ్యులు, బంధువులు పండుగను ఆనందమయంగా జరుపుకున్నారు.
-నమస్తే నెట్వర్క్