ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. ‘తొలిమెట్టు’ పేరుతో తెలుగు, ఇంగ్లిష్, గణితం ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి 1 నుంచి 5వ తరగతి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నది. గతేడాది ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా సత్ఫలితాలు రావడంతో 2023-24 విద్యాసంవత్సరంలో తొలిమెట్టును మరింత మెరుగ్గా అమలుచేయాలని విద్యాశాఖ అడుగులు వేస్తున్నది. దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లా నుంచి ఆరుగురు రిసోర్స్పర్సన్లు హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. వీరు నేటి నుంచి మూడ్రోజులపాటు సబ్జెక్టుకు ఇద్దరు చొప్పున ప్రతి మండలం నుంచి ఆరుగురు మొత్తం 126 మందికి ఖమ్మం నగరంలోని రిక్కాబజార్ స్కూల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఈ నెల 31వ తేదీ నుంచి జిల్లాలోని మిగిలిన ఉపాధ్యాయులకు మూడు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈవిధంగా తొలిమెట్టును పకడ్బందీగా అమలు చేసేందుకు ఉన్నతాధికారులు కార్యాచరణను రూపొందించారు.
– ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 23
ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 23 : పాఠశాల విద్యలో ప్రాథమిక విద్య ‘పునాది’. ప్రాథమిక స్థాయిలో సరైన మౌలిక భాషా గణిత సామర్థ్యాలు సాధిస్తేనే విద్యార్థులు ఉన్నతస్థాయిలో రాణిస్తారు. పాఠశాల విద్య పూర్తయ్యే సరికి విద్యార్థులందరూ ఆయా సబ్జెక్ట్‌ల్లో నిర్దేశించిన సామర్థ్యాలు, అభ్యసన ఫలితాలను సాధిస్తేనే ఉన్నత లక్ష్యాల సాధనకు మార్గం సుగమమవుతుంది. అందుకే కనీస సామర్థ్యాలు మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరంలో ‘తొలిమెట్టు’ పేరుతో తెలుగు, గణితం, ఇంగ్లిష్‌లో సామర్థ్యాల పెంపు కోసం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేకంగా ప్రాథమికస్థాయి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలనివ్వడంతో 2023-24 విద్యాసంవత్సరంలో కూడా మరింత పకడ్బందీగా ‘తొలిమెట్టు’ను అమలుచేయాలని విద్యాశాఖ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా సబ్జెక్ట్‌ల్లో మారిన అంశాలపై ఈ నెల 24నుంచి 26వ తేదీ వరకు జిల్లాస్థాయి శిక్షణ నిర్వహిస్తున్నారు.
ప్రతి విద్యార్థికి వర్క్‌బుక్
2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వార్షిక, యూనిట్, పాఠ్య, రోజువా పీరియడ్ ప్రణాళికలను రూపొందించారు. వీటి ఆధారంగా ఉపాధ్యాయులు ఆయా తరగతుల వారిగా బోధనాభ్యసన ప్రక్రియలను అర్థవంతంగా, పిల్లలు భాగస్వామ్యం చురుగ్గా ఉండేలా నిర్వహించనున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వర్క్‌బుక్‌లను అందించనున్నారు. ఉపాధ్యాయులకు కూడా లెస్సన్ప్లాన్లను అందిస్తున్నది. తరగతుల వారీగా ఉపాధ్యాయులు ఏఏ వారంలో ఏఏ పాఠాలు అమలు చేయాలనే దానిపై ఉన్నతాధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.
శిక్షణ ఇచ్చే రిసోర్స్పర్సన్లు
తెలుగు సబ్జెక్ట్‌కు ప్రవీణ్, జీవన్, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌కు శ్రావణ్‌కుమార్, షేక్ రెహనాబేగం, గణితం సబ్జెక్ట్‌కు సంక్రాంతి అనిల్, సైదా ఈ ఆరుగురు రిసోర్స్పర్సన్లు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరు హైదరాబాద్‌లో ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్నారు.
మరింత మెరుగయ్యేందుకు..
2023-24 విద్యా సంవత్సరంలో బోధనను మరింత సమర్ధవంతంగా మార్చి విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఎస్సీఈఆర్టీ తెలంగాణ విషయ నిపుణులు ప్రత్యేకంగా రూపొందించిన తెలుగు, గణితం,ఆంగ్లం వర్క్‌బుక్స్‌ను ప్రతి విద్యార్థికి ఉచితంగా అందించనున్నారు. బోధనా ప్రక్రియను కచ్చితమైన సోపానాల ప్రకారం నిర్వహించేందుకు ఉపాధ్యాయులకు పాఠ్య ప్రణాళికలను రూపొందించి అందించనున్నారు. తరగతి గదిలో సులభంగా, సమర్ధవంతంగా బోధన జరిగేందుకు బోధనోపకరణలు రూపొందించడం, వినియోగించడంపై కూడా శిక్షణ కల్పించనున్నారు.
నేటినుంచి జిల్లాస్థాయిలో శిక్షణ
నగరంలోని రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రంగా ఈ నెల 24నుంచి 26వ తేదీ వరకు మూడ్రోజులపాటు జిల్లాస్థాయి ఉపాధ్యాయులకు ఆరుగురు రిసోర్స్పర్సన్లు శిక్షణ ఇవ్వనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్ట్‌ల్లో ఇద్దరు చొప్పున ఆరుగురు రిసోర్స్పర్సన్లు ఇప్పటికే హైదరాబాద్‌లో శిక్షణ పొంది ఉన్నారు. ఈ శిక్షణలో ప్రతి మండలం నుంచి సబ్జెక్ట్‌కు ఇద్దరు చొప్పున మూడు సబ్జెక్ట్‌లకు ఆరుగురు ఉపాధ్యాయులు అంటే మొత్తం 21 మండలాల నుంచి 126 మంది జిల్లాస్థాయి శిక్షణ ఉందనున్నారు. వీరు జూలై 31వ తేదీ నుంచి మూడు విడతల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతులకు బోధించే తెలుగు, ఇంగ్లిష్, గణితం ఉపాధ్యాయులకు మండలస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు.
శిక్షణకు ఏర్పాట్లు పూర్తి..
ఎస్సీఈఆర్టీ తెలంగాణ ఆదేశాల మేరకు నేటినుంచి జిల్లాస్థాయి శిక్షణకు ఏర్పాట్లు పూర్తిచేశాం. ఎంపికైన ప్రతి మండల రిసోర్స్‌పర్సన్ తప్పనిసరిగా సమయానికి హాజరై శిక్షణలో బోధించే మెళకువలను ఉపాధ్యాయుడి స్థాయి వరకు తీసుకువెళ్లే విధంగా కృషిచేయాలి. గత సంవత్సరం ‘తొలిమెట్టు’ మన జిల్లాలో అద్భుత ఫలితాలనిచ్చింది. కలెక్టర్ సూచనల మేరకు ప్రతి నెల లక్ష్యాలను నిర్దేశించుకుని, నెల చివరన పరీక్ష నిర్వహించుకొని విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపర్చుకోనున్నాం. కార్యక్రమం అమలులో నోడల్ అధికారులు, ఎంఈవోలు, కాంప్లెక్స్ నోడల్ అధికారులు, రిసోర్స్పర్సన్లు, ఉపాధ్యాయుల కృషి ప్రశంసనీయం.
– సోమశేఖరశర్మ, డీఈవో
లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం..
విద్యార్థులందరూ సామర్థ్యాలు సాధించేలా 2023-24 విద్యాసంవత్సరానికి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. బోధనా, పర్యవేక్షణ ఆ దిశగా ఉన్నతాధికారుల సూచనలతో పటిష్ఠంగా నిర్వహిస్తాం. విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు తొలిమెట్టు శిక్షణను విజయవంతంగా పూర్తి చేస్తాం.
– కేశవపట్నం రవికుమార్, అకడమిక్ మానిటరింగ్ అధికారి