కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి మోసకారి ప్రభుత్వమని ఉమ్మడి ఖమ్మం జిల్లా బీసీలు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఆశజూపి హామీ ఇచ్చిందని, అధికారం ‘చేతి’కి చిక్కాక ద్రోహం తలపెట్టిందని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి రాగానే రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను తీసుకొస్తామంటూ ఎన్నికల సభల సాక్షిగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని తూర్పారబట్టారు. కామారెడ్డి డిక్లరేషన్ను కాగితపు ముక్క కూడా లేకుండా కాల్చివేసిందని కోపోద్రిక్తులయ్యారు. కేవలం ఈడబ్ల్యూఎస్ కోటా కోసం బీసీలను అణగదొక్కాలన్న కుట్ర ఉన్నట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కన్పిస్తోందని ఆరోపించారు. 2014లో 1.85 కోట్లుగా ఉన్న బీసీలు 2025లో 1.64 కోట్లకు ఎలా తగ్గుతారని ప్రశ్నించారు.
అదే సమయంలో ఓసీల జనాభా అంతే గణనీయంగా ఏవిధంగా పెరిగిందో చూపాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడిగా కులగణన చేపట్టిందని ఆరోపించారు. సర్వేను సమగ్రంగా చేపట్టకుండా కాకిలెక్కలను చూపిస్తోందని ధ్వజమెత్తారు. ఈ తప్పుడు గణాంకాలను తాము ముమ్మాటికీ నమ్మబోమని స్పష్టం చేశారు. అదే సందర్భంలో తమకు ఇచ్చిన మాట ప్రకారం రాజ్యాంగపర చిక్కులులేని 42 శాతం రిజర్వేషన్లు అమలుచేసే వరకూ ఈ రేవంత్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తెస్తామంటూ నమ్మబలికి గత అసెంబ్లీ ఎన్నికల్లో తమతో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు తప్పుడు లెక్కలు చెబుతోందని, కేంద్రం ఆమోదించాలంటూ మెలికలు పెడుతోందని మండిపడ్డారు. రిజర్వేషన్ల అంశంలో ఈ ప్రభుత్వం తమకు ద్రోహం చేసిందంటూ రగిలిపోతున్నారు.
-ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 7
కులగణన సర్వేలో బీసీ కులస్తులను తక్కువగా చూపించడం నట్టేట ముంచడమే అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే అంతా బూటకం. బీసీలను రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో బీసీల శాతాన్ని తక్కువగా చూపించారు. పెరుగుతున్న జనాభానుబట్టి బీసీల జనాభా ఎక్కువగా ఉంటుందనేది ఎవరికైనా తెలుస్తుంది. ఈ విషయం ప్రభుత్వానికి తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ఇదంతా తప్పుడు సర్వే అని అర్థమవుతోంది.
-రాంబాబు, బీఆర్ఎస్ మండల బీసీ కార్యవర్గ సభ్యుడు
అగ్రవర్ణాల కులస్తుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్వే చేసినట్లు స్పష్టంగా అర్థమవుతున్నది. నామమాత్రంగా సర్వే చేసి పూర్తయిందని చెప్పడం సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందే. ప్రభుత్వం చేసిన సర్వే తీరును ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ స్థానాలు పెంచి బీసీలను రాజకీయంగా ప్రోత్సహించాలి.
-నూనె హరిబాబుయాదవ్, రామన్నపాలెం, వేంసూరు మండలం
కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే అంతా బోగస్. ఇల్లిల్లూ తిరగకుండానే నామమాత్రంగా సర్వే చేసి చేతులు దులుపుకుంది. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాను పరిగణనలోకి తీసుకోకుండాతగ్గించి లెక్కలు చూపించడం ఎంతవరకు సబబు. పూర్తి సర్వే చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. అన్ని రంగాల్లో వెనుకబడిన బీసీలందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలి.
-వట్టం రాంబాబు, మణుగూరు
బీసీ కులగణనలో అసంపూర్తి సమాచారం ఉంది. అగ్రవర్ణాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసినట్లు తెలుస్తుంది. 100 శాతం సర్వే చేయకుండా తూతూమంత్రంగా చేసి పూర్తయిందని చెప్పడం దారుణం. బీసీలకు అన్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి.
-మహంకాళి రామారావు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కులగణన సర్వేతో పోల్చితే ఈ సర్వేలో బీసీ జనాభా పెరగాల్సి ఉండగా.. తగ్గింది. 100 శాతం సర్వే జరగలేదు. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే బీఆర్ఎస్ వారికి అండగా ఉంటుంది. బీసీలకు వెంటనే 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలి.
-బెజ్జంకి కనకాచారి, సారపాక
రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన కులగణన సర్వే తప్పుల తడక. మొక్కుబడిగా సర్వే చేసి బీసీలపై సవతి తల్లి ప్రేమ చూపుతోంది. రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు ఉన్నారనేది జగమెరిగిన సత్యం. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను మరుగున పడేసి తప్పుదోవ పట్టిస్తుంది. బీసీలకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోంది. సరైన సమయంలో బీసీల సత్తా చూపుతాం.
-దొడ్డి తాతారావు, బీసీ నాయకుడు, బీఆర్ఎస్ మండల కన్వీనర్, చర్ల
అత్యధిక శాతం జనాభా ఉన్న బీసీలకు రాష్ట్రం ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. సమగ్ర సర్వే పేరుతో మొక్కుబడిగా సర్వే నిర్వహించి కాకి లెక్కలు చూపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేయదని కులగణన సర్వే ద్వారా రుజువైంది. వాస్తవాలను వక్రీకరించిన కాంగ్రెస్ విధాలను ప్రజలు గమనిస్తున్నారు. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్న రేవంత్ చేసిన నమ్మక ద్రోహానికి గుణపాఠం చెప్పుడం ఖాయం.
-పంజా రాజు, బీసీ నాయకుడు, చర్ల
స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పేరెత్తింది. అదంతా ఒట్టి అబద్ధం. అత్యధికంగా ఉన్న బీసీల ఓట్లతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోంది. బీసీ జనాభాను తక్కువ చేసి చూపెడుతోంది. బీసీ సంఘాలన్నీ దీనిపై ఆలోచన చేయాలి. బీసీలకు బేషరతుగా కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి.
-భూపతి రమేశ్, బీసీ సంఘం నాయకుడు, చండ్రుగొండ మండలం
గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించిన సమగ్ర సర్వేలో బీసీలు 52 శాతం ఉన్నట్లు నిర్ధారణ కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 46 శాతం ఉండటం ఏమిటి? ఎక్కడైనా సర్వేలో జనాభా పెరుగుతుంది. కానీ తగ్గుతుందా? రాజ్యాధికారంలో బీసీలను భాగస్వాములు చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వంలో పూర్తిగా లోపించింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం ఇలాంటి తప్పుడు సర్వే చేసి బీసీలను అన్యాయం చేయడం తగదు.
-బొల్లి వెంకట్రావు, తూరుబాక, దుమ్ముగూడెం మండలం
తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి బీసీలపై చిన్నచూపు చూస్తోంది. సర్వే రిపోర్టులను పబ్లిక్ డొమైన్లో విడుదల చేశారు. అవి పూర్తిగా తప్పుగా ఉన్నాయి. దేశంలో జనాభా పెరుగుతుంటే, తెలంగాణలో మాత్రం జనాభా తగ్గుతుందని సర్వేలు స్పష్టం చేయడం వింతగా ఉంది. రాష్ట్రంలో ముదిరాజుల సంఖ్య ప్రభుత్వం తెలిపిన దానికంటే ఇంకా ఎక్కువ ఉంటుందని మేము అనుకుంటున్నాం.
-గాజుబోయిన ఏసుబాబు, బీసీ సంఘం నాయకుడు, దమ్మపేట