దశాబ్దాలుగా అడవుల్లో గుట్టలను చదును చేసి.. రాళ్లు రప్పలను తొలగించి పోడు భూములను సాగు భూములుగా మలుచుకున్నారు. వర్షాధారంతోపాటు నీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో గుంతలను తవ్వి నీటిని నిల్వ చేసుకుని పంటలు పండించుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఆ భూములకు పట్టాలు అందించాలని గత ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా హక్కులు దక్కలేదు. తెలంగాణ ప్రభుత్వం వారి గోడు విని.. భూమిపై హక్కులు కల్పించేందుకు నిర్ణయించింది. పకడ్బందీగా సర్వే చేపట్టిన అధికారులు భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 1,51,195 ఎకరాల్లో 50,595 మంది పోడు రైతులు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణ ప్రభుత్వం వీరికి ఈ నెల 30 నుంచి పట్టాలు అందజేయనున్నది.
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా పోడు భూములు సాగయ్యే జిల్లాల్లో భద్రాద్రి ఒకటి. జిల్లాలో 10,13,698 ఎకరాల్లో అటవీశాఖ భూమి ఉన్నట్లు ఓ అంచనా. ఈ భూమిలో సుమారు 20 శాతానికి పైగా అన్యాక్రాంతమైనట్లు సర్కార్ ప్రాథమిక అంచనాకు వచ్చింది. దీనిలో ఎక్కువశాతం భూమిని పోడు చేసి దశాబ్దాల నుంచి గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. రెండు మూడు తరాల నుంచి వారు ఆయా భూములకు పట్టాలు ఆశిస్తున్నారు. పోడుపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ యంత్రాంగాన్ని మూడంచెల వ్యవస్థ సర్వేకు ఆదేశించారు. దీనిపై ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో మంతనాలు చేశారు. పోడు భూములపై అధ్యయనానికి ఓ సబ్‌కమిటీని నియమించారు. సబ్‌కమిటీ నివేదికల ఆధారంగా 140 జీవో ఇచ్చి పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. అధికారులు పకడ్బందీగా సర్వే చేపట్టి భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 1,51,195 ఎకరాలను 50,595 మంది పోడు రైతులు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. వీరికి త్వరలో పట్టాలు అందనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా పట్టాలు పొందుతున్న జిల్లాల్లో భద్రాద్రి జిల్లాదే అగ్రస్థానం.
మంత్రి హరీశ్ చేతుల మీదుగా..
2008-12 వరకు నాటి ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా కేవలం 24 వేల మందికి మాత్రమే పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకొన్నది. పట్టాల పంపిణీ చట్టం కేంద్ర పరిధిలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక జీవో తీసుకొచ్చి గిరిజనులకు పోడు రైతులకు పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 30 తేదీన సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన గిరిజనులకు పట్టాలు పంపిణీ చేస్తారు. ఇదేరోజు భద్రాద్రి జిల్లాలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పోడు రైతులకు పట్టాలు ఇవ్వనున్నారు. పట్టాల పంపిణీ ఏర్పాట్లతో యంత్రాంగం నిమగ్నమైంది.
ఇదీ పోడు ముఖచిత్రం..
రాష్ట్రవ్యాప్తంగా అటవీ ప్రాంత విస్తరణ ఉన్న జిల్లాలో భద్రాద్రి ఒకటి. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 332 పంచాయతీల్లో 6,5616 మంది గిరిజనులు 2,41,107 ఎకరాలు, ఇతరులు 17,725 మంది 58,161 ఎకరాల్లో పోడు చేస్తున్నారు. ఆయా భూములకు సర్కార్ సర్వే చేయించి పట్టాలు తీసుకునేందుకు అర్హులను గుర్తించింది.
పోడు రైతులకూ రైతుబంధు..
పట్టా ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు ఇవ్వాలనేది ప్రభుత్వ సంకల్పం. ఐదేళ్ల నుంచి సాధారణ రైతులకు ఏటా పెట్టుబడి సాయం అందిస్తున్నది. ఈ నెల 30 తర్వాత పట్టాలు అందుకున్న పోడు రైతులకూ రైతుబంధు అందనున్నది. దీంతో పోడు రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పట్టాలు తీసుకున్న తర్వాత గిరిజనులు తిరిగి అడవిని నరకొద్దని తీవ్రమైన ఆంక్షలు పెట్టింది. భవిష్యత్‌లో అటవీ భూముల జోలికి వెళ్లకూడదని ఆదేశాలిచ్చింది. వీటిపై గిరిజనులూ సూత్రప్రాయంగా అంగీకరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని గిరిజన సంఘాల నేతలూ స్వాగతించారు.
పట్టాలతోపాటు రైతుబంధు హర్షణీయం..
చరిత్రలో నిలిచిపోయే విధంగా సీఎం కేసీఆర్ పోడు రైతులకు పట్టాలు ఇవ్వనున్నారు. ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ గిరిజనులకు పట్టాలు ఇస్తున్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. వాటన్నింటిలో పోడు రైతులకు పట్టాలు అతిపెద్ద సంచలనం. పట్టాలు అందిన ప్రతిఒక్కరికీ సర్కార్ రైతుబంధు సొమ్మూ అందించనున్నది. ఏజెన్సీవాసులుగా మేము ఏం చేసినా సీఎం రుణం తీర్చుకోలేం.
– భూక్యా సోనా, ఎంపీపీ, లక్ష్మీదేవిపల్లి మండలం
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాను..
సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. భద్రాద్రి జిల్లా పూర్తి ఏజెన్సీ జిల్లా. సీఎం ప్రకటనతో ఇలాంటి జిల్లాలోని గిరిజనులకు ఎంతో మేలు జరుగుతుంది. పోడు పట్టాలు ఇస్తున్నందుకు కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. దశాబ్దాల పాటు కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం చూపడం గొప్ప విషయం. స్వరాష్ట్రం వచ్చాక కేసీఆర్ ఇలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.
– రేగా కాంతారావు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే
పట్టాలను సిద్ధం చేశాం..
పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. అందుకు అనుగుణంగా భద్రాద్రి జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నాం. పట్టాలు అందిన వారందరికీ రైతుబంధు సొమ్ము కూడా అందుతుంది. దీర్ఘకాలం నుంచి ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం లభిస్తుండడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– అనుదీప్, భద్రాద్రి కలెక్టర్