ఖమ్మం, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై ఖమ్మం జిల్లా ఓటర్లు కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గణన పత్రాలు పూరించే అంశం ఓటర్లను చాలావరకూ అయోమ యానికి గురిచేస్తోంది. జిల్లాలో కొన్ని దశాబ్దాలుగా ఓటు నమోదు, వినియోగం అత్యధికంగా జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఓటర్లు ప్రత్యేక సవరణపై సైతం అదేస్థాయిలో దృష్టిసారించారు. ఎన్నికల సంఘం రూపొందించిన నియమావళికి అనుగుణంగా ఓటరు జాబితాలో తమ ఓటు సవరణకు సంబంధించి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
గత నెల 24న ప్రారంభమైన ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగనుంది. సవరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ స్థాయి అధికారులు(బీఎల్వో) ఎన్యూమరేషన్ పత్రాలను ఇప్పటికే పంపిణీ చేశారు. అయితే, ఈ పత్రాలు నింపడం మాత్రం సాధారణ ఓటర్లకు సవాలుగా మారింది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జిల్లావ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో జరగ్గా వాటిని పూర్తిచేయడానికి మాత్రం ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఫారాల్లో ఉన్న సాంకేతిక అంశాలు, కాలమ్స్ అర్థంకాక విద్యావంతులు సైతం అయోమయానికి గురవుతున్నారు. నిరక్షరాస్య ఓటర్లయితే తమకు ఇచ్చిన ఫారాలను ‘ఎవరితో పూర్తి చేయించుకోవాలి? ఏమి వివరాలు చెప్పాలి? ఏ పత్రాలు ఆధారాలుగా జతచేయాలి?’ అనే విషయాలు తెలియక ఇబ్బంది పడుతున్నారు. బీఎల్వోలు ఓటర్లకు వీటిపై సమాచారం ఇస్తున్నప్పటికీ ఓటర్లు పూర్తిస్థాయి అవగాహన చేసుకోలేకపోతున్నారు. దీంతో పత్రాలు నింపడంలో గందరగోళ పడుతున్నారు. తమ ఎన్యూమరేషన్ పత్రాలు నింపేందుకు తమకు తెలిసిన వారి వద్దకు పరుగులు తీస్తున్నారు.
ప్రధానంగా 2002 ఓటరు జాబితాలో తమ పేరు ఉండడంతోపాటు పోలింగ్ స్టేషన్, క్రమసంఖ్య, నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్ నంబరు వంటి అంశాలను గణన ఫారంలో పొందుపర్చాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంపై చాలామంది ఓటర్లకు పూర్తిస్థాయిలో అవగాహనలేక అయోమయానికి గురవుతున్నారు. 2002 నాటి ఓటర్ల జాబితాలోని వివరాల సేకరణ కోసం అనేక పాట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటరు జాబితా పారదర్శకత కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సర్వే చేయిస్తున్నా వీటిలో పొందుపర్చిన అంశాలను సేకరించి పత్రాల రూపంలో సమర్పించడం సాధారణ ఓటర్లకు తలకుమించిన భారంగా మారుతోంది. ఎన్యూమరేషన్ పత్రాల్లోని కొన్ని కాలమ్స్ సాధారణ ఓటర్లకు అర్థంకాని పరిస్థితి నెలకొంది. కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ నంబర్లతోపాటు సెల్ఫ్, నో మ్యాపింగ్ వంటి సాంకేతిక పదాల అర్థలేమిటో వారికి తెలియడం లేదు. వాటిని ఎలా నింపాలో కూడా తెలియక తికమక పడుతున్నారు.
బీఎల్వోలు అందించిన ఓటరు ఎన్యూమరేషన్ పత్రాలను పూర్తిచేసేందుకు జిల్లాలో పలు ప్రధాన రాజకీయ పక్షాలు తమ పార్టీ నేతలను బూత్ లెవల్ ఏజెంట్లు(బీఎల్ఏ)గా నియమించాయి. ఆ పత్రాలు నింపే ప్రక్రియకు తోడ్పాటు అందిస్తున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు ఇద్దరు చొప్పున బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి వారికి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చింది. ఓటరు జాబితా సవరణలో ఎదురయ్యే అంశాలు, ఓటర్లకు వివరించాల్సిన అంశాలు, ఓటర్ల నుంచి సేకరించి ఆ పత్రాలకు జతచేసి ఆధారాలపై అవగాహన కల్పించడంలో ఈ బీఎల్ఏలు ఓటర్లకు సహకారాన్ని అందిస్తున్నారు. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ జిల్లావ్యాప్తంగా పూర్తయి పన్నెండు రోజులు గడుస్తోంది. ఈ పత్రాలను బీఎల్వోలకు అందించే ప్రక్రియ మాత్రం నిదానంగా కొనసాగుతోంది.
ఖమ్మం జిల్లాలో 12,43,781 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించాల్సింది ఉండగా.. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇక బీఎల్వోలు పోలింగ్ కేంద్రాలవారీగా ఓటర్లు నింపిన పత్రాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వీటిని డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ సైతం ప్రారంభమైంది. ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు నింపడంలో సహకరించేందుకు మండలానికి ఒక హెల్ప్‌డెస్క్‌ను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఓటర్లకు ఎన్నిచోట్ల ఓటు ఉన్నా ఒక్కచోట మాత్రమే ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే, ఈ ఎన్యూమరేషన్ పత్రాలు నింపే సమయంలో ఓటర్లకు సవాలక్ష సందేహాలు తలెత్తుతున్నాయి. ఎన్యూమరేషన్ పత్రాలతోపాటు ఏయే ధ్రువపత్రాలను జతచేయాలన్న అంశంపై సర్వత్రా అయోమయం నెలకొంది.
సంబంధిత ఓటరుకు మ్యాపింగ్ అయితే పత్రాలు ఏయే వాటిని జతచేయాలన్న అంశంపై ఓటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కలగడంలేదు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు, మధిర, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో 1,460 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఆయా పోలింగ్ కేంద్రాల వారీగా ఎన్యూమరేషన్ పత్రాలు అందజేశారు. అయితే, నింపిన పత్రాలను బీఎల్వోలకు దాఖలు చేసే సమయం దగ్గర పడుతుండడంతో ఓటర్లలో ఆందోళన నెలకొంది. నింపిన పత్రాల్లో జరిగిన పొరపాట్లు ఏమిటో, వాటిని సరిచేసుకునే పద్ధతి ఏమిటో అనే వివరాలను పత్రాల్లో పరిశీలించి ఎవరు చెబుతారన్న అంశంపై ఓటర్లలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అనేకచోట్ల బీఎల్వోలు ఎన్యూమరేషన్ పత్రాలను స్వీకరించాక పరిశీలించి అవసరమైన పత్రాలు లేకపోతే వాటిని జతచేయాల్సిందిగా సూచిస్తున్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు సైతం ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.
ఖమ్మం సిటీ, జూలై 6: ఖమ్మం నగరంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఆర్ఎస్ నేతలు బిజీబిజీగా ఉంటున్నారు. బీఎల్వోలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తున్నారు. వాటిని ఎలా నింపాలో అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సోమవారం ఖమ్మంలోని 18, 22, 23 డివిజన్లతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజుతోపాటు మాజీ కార్పొరేటర్లు షేక్ మక్బూల్, కర్నాటి కృష్ణ, పల్లా రోజ్లీనా, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎండీ ఖమర్ తదితరులు ఎస్ఐఆర్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. వాటిని పూర్తిచేసే విధానం గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 98.82 శాతం పూర్తికాగా డిజిటలైజేషన్ ప్రక్రియ మాత్రం 11.85 శాతం వద్దే ఆగి పోవడం విస్మయాన్ని కలిగిస్తోందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు బండారు శ్రీను, పరమేశ్వరరావు, జమాల్, తాజుద్దీన్, జావీద్ తదితరులు పాల్గొన్నారు.
సర్ దరఖాస్తు పూరించాలంటే బీఎల్వో సహకారం తప్పనిసరిగా కావాలి.. లేకుంటే దరఖాస్తును పూరించలేము. చదువురాని వారి పరిస్థితి మరీ దారుణం. 2002లోని ఓటరుకార్డు వివరాలు చూసుకోవడం, ఇతర సందేహాలను బీఎల్వోలు నివృత్తి చేస్తేనే దరఖాస్తు పూరించడం సాధ్యమవుతుంది.
– కిలాని వెంకాయమ్మ, మల్లారం, దమ్మపేట
మా ఇంటికొచ్చి దరఖాస్తు ఇచ్చి వారంరోజులు దాటింది. నాకు రాయటం రాదు. అధికారుల కోసం ఎదురుచూస్తున్నాను. మా ఊళ్లో చాలామంది పరిస్థితి ఇదే. మా లాంటి ముసలోళ్లకు దరఖాస్తు రాయటం కష్టంగా ఉంది. చదువుకున్న వారు సైతం దరఖాస్తులు రాయలేక ఇబ్బందులు పడుతున్నట్లు కనిపిస్తున్నది.
– తేజావత్ సోనా, వృద్ధురాలు, బెండాలపాడు, చండ్రుగొండ