కూసుమంచి రూరల్/ ఖమ్మం రూరల్, డిసెంబర్ 28: అన్నదాతల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతుపక్షపాతిగా నిలిచిన ఘనత ఆయనకే దక్కుతుందని స్పష్టం చేశారు. కూసుమంచి మండలం చేగొమ్మ సొసైటీ పరిధిలోని 240 మంది రైతులకు మంజూరైన రూ.1.45 కోట్ల విలువైన పంట రుణాల చెక్కులను చేగొమ్మ రైతువేదికలో బుధవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. అన్నదాతల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని గుర్తుచేశారు. తాజాగా యాసంగి సీజన్ రైతుబంధు సాయాన్ని కూడా బుధవారం నుంచే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు.
రైతులందరూ సొసైటీ రుణాలను, రైతుబంధు సాయాన్ని సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేవని స్పష్టం చేశారు. సహకార సంఘాల నుంచి ఎరువులు, విత్తనాలు, రుణాలు అందించడంతోపాటు రైతులు పండించిన పంటలను కూడా కొనుగోలు చేసి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలో మరే రాష్ట్రమూ లేదని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు కూరాకుల నాగభూషణం, నర్మద, పాముల సంగయ్య, హనుమంత్, నల్లమల వెంకటేశ్వరరావు, ఇంటూరి శేఖర్‌రావు, రామసహాయం బాలకృష్ణారెడ్డి, బానోత్ శ్రీనివాస్, ఇంటూరి బేబీ, బానోత్ రామ్‌కుమార్, వాసంశెట్టి వెంకటేశ్వర్లు, నలబోలు చంద్రారెడ్డి, జర్పుల బాలాజీనాయక్, ఊడుగు జ్యోతి, మల్లీడు వెంకటేశ్వర్లు, బీ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
దేశంలోనే ఏ రాష్టంలోనూ లేనివిధంగా అన్ని వర్గాల ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తూ సంక్షేమ సారథిగా నిలిచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో 43 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను, 73 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు బెల్లం ఉమ, బెల్లం వేణుగోపాల్, గూడ సంజీవరెడ్డి, అక్కినపల్లి వెంకన్న, అశోక్, శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, ఆంజనేయులు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.