అశ్వారావుపేట/ కూసుమంచి, మార్చి 2: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే సర్కార్ ఆసుపత్రులను సమూలంగా మార్చింది. ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తల ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందజేస్తున్నది. తాజాగా ఆశ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు అందజేసింది. గతంలో రికార్డుల్లో వివరాలు నమోదు చేసిన ఆశ కార్యకర్తలు ఇకపై స్మార్ట్ ఫోన్లలో నమోదు చేయనున్నారు. ఇకపై ఏ ఆరోగ్య సమాచారమైనా ఉన్నతాధికారుల నుంచి సులభంగా తెలుసుకునే వెసులుబాటు ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 1,440 మంది, ఖమ్మం జిల్లావ్యాప్తంగా 1,348 మందికి స్మార్ట్ఫోన్లు అందాయి.
స్మార్ట్ఫోన్ల ద్వారా ఆశ కార్యకర్తలు ఎప్పటికప్పుడు వైద్యారోగ్యశాఖ సమాచారం తెలుసునే అవకాశం ఏర్పడింది. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వివరాలు నమోదు చేయనున్నారు. గతంలో సమావేశాలంటే ఆశ కార్యకర్తలు తమ వెంట అనేక రికార్డులను తీసుకెళ్లేవారు. ఇప్పుడు చేతిలో కేవలం మొబైల్ ఉంటే చాలు. అన్ని వివరాలు అరచేతిలో ఉన్నట్లే. అలాగే ఆన్లైన్లో వివిధ రకాల జబ్బులు, వాటి నివారణ మార్గాలు తేలికగా తెలుసుకునే అవకాశం ఉండడంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. స్మార్ట్ఫోన్ల పంపిణీపై ఆశ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆశ కార్యర్తలకు స్మార్ట్ఫోన్ల పంపిణీ పూర్తయ్యింది. ప్రజారోగ్య వివరాలన్నీ స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులో ఉంటాయి. ఆశ కార్యకర్తలు వైద్యారోగ్యశాఖ సూచించిన విధంగా వివరాలను ఆన్లైన్ చేయాల్సి ఉన్నది. మొబైల్స్‌తో సిబ్బందికి పనిభారం తగ్గుతుంది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంది.
-డాక్టర్ సుకృత, ప్రోగ్రాం ఆఫీసర్, కొత్తగూడెం
రాష్ట్రప్రభుత్వం ఆశ కార్యకర్తలను గుర్తించింది. గత ప్రభుత్వాలు మమ్మల్ని చిన్న చూపు చూసింది. తెలంగాణ వచ్చిన తర్వాతే మమ్మల్ని ఇతర ఉద్యోగులతో పాటు గుర్తించి వైద్య సేవల్లో భాగస్వాములను చేశారు. జీతాలు పెంచారు.
– రాములమ్మ, ఆశ కార్యకర్త, గైగొళ్లపల్లి
నేను 15 ఏళ్ల నుంచి ఆశ కార్యకర్తగా పనిచేస్తున్నా. స్మార్ట్ఫోన్లు అందకముందు ఏ పని చేయాలన్నా 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూసుమంచికి రావాల్సి వచ్చేది. ఇప్పుడు మొబైల్‌తో అన్ని అవసరాలు తీరుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ చేతిలోకి వచ్చాక నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలు కలిగింది. అత్యవసర సమయాల్లో ప్రజలు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఆరోగ్యసలహాలు పొందుతున్నారు. ప్రభుత్వమే చొరవ తీసుకుని స్మార్ట్ఫోన్లు అందజేయడం ఆనందాన్నిచ్చింది.
– ఆళ్లగడప దేవకృప,ఆశ కార్యకర్త, జక్కేపల్లి
స్మార్ట్ఫోన్లతో మాకు పని భారం తగ్గుతుంది. ఎప్పటికప్పుడు నివేదికలను ఆన్లైన్ చేసే అవకాశం వ చ్చింది. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మా రుమూల గ్రామాల్లో అత్యవసర సేవలు అందించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. రోజువారీ పనులకూ స్మార్ట్‌ఫోన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
-మంగమ్మ, ఆశ కార్యకర్త, జీళ్లచెరువు