తిరుమలాయపాలెం మండలంలోని ఎస్సారెస్పీ కాలువలు చీమలు దూరని చిట్టడవి.. కాకులు దూరని కారడవిని తలపిస్తున్నాయి. దట్టమైన చెట్లతో నిండిపోయి నీరు ముందుకుపారని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ కాల్వల్లో పెరిగిన చెట్లను తొలిగించకుండానే ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా పాలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు.
అయితే ఆ సాగర్ జలాలు తమ చెరువుల్లోకి చేరుతాయో లేదోనని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి చెరువులూ నిండకా.. ‘భక్తరామదాసు’ నీళ్లూ రాక తమ భూములు బీళ్లుగా మారతాయని ఆవేదన చెందుతున్నారు. ఇరిగేషన్ అధికారులు కాల్వల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో కొన్నిచోట్ల రైతులే స్వతహాగా తమ పరిధిలోని కాల్వలను జేసీబీల సహాయంతో శుభ్రం చేసుకుంటున్నారు.
– తిరుమలాయపాలెం, ఆగస్టు 11
ఖమ్మంజిల్లాలో అత్యంత కరువుపీడిత ప్రాంతమైన తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాలతోపాటు పాలేరు నియోజకవర్గానికి సాగునీటి వసతి కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘భక్తరామదాసు’ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. పాలేరు రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కరువు నెలల్లో పారించింది. పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలతోపాటు ముదిగొండ, మహబూబాబాద్ జిల్లా మరిపెడ, గాలివారిగూడెం గ్రామాలతో కలిపి మొత్తం 75వేల ఎకరాలకు సాగునీరు అందించింది. గత ఏడేళ్లుగా భక్తరామదాసు ఎత్తిపోత్తల పథకం ద్వారా ఈ ప్రాంత రైతులు వరి రెండు పంటలు పండించారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సారెస్పీ కాల్వల్లో పెరిగిన చెట్లను తొలిగించకుండానే ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీభక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా చెరువుల్లోకి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ కాల్వల్లో నీటి సరఫరా ఇబ్బందికరంగా మారింది. మరిపెడబంగ్లా సమీపంలో 045 కిలోమీటరు నుంచి తల్లంపాడు 071 కిలోమీటరు వరకు డీబీఎం-60 మెయిన్కెనాల్లో చెట్లు పెరిగాయి. దీంతో నీటి ప్రవాహం ఆలస్యంగా జరుగుతున్నది. కాల్వల్లో పెరిగిన చెట్ల వలన కొండాపురం స్టేజీ సమీపంలో కాల్వల్లో నీరు పొర్లుతున్నది. మండలంలోని కొక్కిరేణి స్టేజీ సమీపంలోని 20ఎల్ కాల్వలో విపరీతమైన చెట్లు పెరగడంతో నీటి ప్రవాహం నిలిచిపోయింది.
దీంతో ఖమ్మంరూరల్ మండలంలోని చింతపల్లి, ఆరెకోడు, వెంకటాయపాలెం, కాశిరాజిగూడెం, గోళ్లపాడు తదితర గ్రామాల్లోని చెరువుల్లోకి శ్రీభక్తరామదాసు ఎత్తిపోతల పథకం నీరు ప్రవహించే పరిస్థితి లేకుండా పోయింది. తిరుమలాయపాలెం మండలంలోని వెదుళ్లచెరువు, తిరుమలాయపాలెం, బీచరాజుపల్లి, రమణతండా ప్రాంతంలోని చెరువులు నింపే కాల్వ సైతం అసంపూర్తిగానే ఉండడంతో ఆ ప్రాంతంలోకి నీటి సరఫరా కావడం లేదు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు పారుతున్న డీబీఎం-60 మెయిన్ కెనాల్తోపాటు 35 ఓటీలు, మైనర్ సబ్మైనర్ కాల్వల్లోనూ చెట్లు పెరిగి నీటి సరఫరాకు ఆటంకంగా మారింది. ప్రభుత్వం మంత్రులు చొరవ తీసుకొని ఎస్సారెస్పీ కాల్వల్లో చెట్లను తొలిగించి పాలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో చెరువుల్లో నింపే అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు.