అశ్వారావుపేట, జనవరి 5 : దేశానికి వెన్నుముకగా ఉన్న రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతున్నది. కూలీల వలసలను నివారిస్తూ స్థానికంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే కూలీలకు ఉపాధితోపాటు వ్యవసాయ రంగాభివృద్ధికి దోహదపడుతుందని రైతులు, రైతు సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారు పెడచెవిన పెడుతున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయలేమని కేంద్రం ప్రకటించడంతో రైతులు, రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైతుల పట్ల బీజేపీ చిన్నచూపు చూస్తున్నదని అన్నివర్గాల ప్రజలు మండిపడుతున్నారు. అన్నం పెట్టే రైతన్నలకు మేలు చేయాలనే తపన కేంద్ర ప్రభుత్వానికి లేకపోగా వ్యవసాయరంగంపై విషం కక్కుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనుసంధానం చేయాలని నీతి ఆయోగ్ సూచన
వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయాయి. దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉంది. గిట్టుబాటు ధర లభించడంలోనూ దళారుల వల్ల రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంటలు పండించడంలో రైతులకు ప్రధానంగా కూలీల కొరత వెంటాడుతున్నది. ఈ తరుణంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు మేలు జరుగుతుందని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. అప్పట్లో నీతి ఆయోగ్ నివేదిక రైతులకు వరంగా మారుతుందని రైతులు సంతోషించారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం నీతి ఆయోగ్ నివేదికను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రైతుల ఆశలు ఆవిరైపోయాయి. ప్రజలకు మంచి పాలన అందిస్తామని మభ్యపెట్టి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ రైతులను విస్మరించడమే కాకుండా ప్రజలకు ఆర్థిక భారం మోపుతూ నిత్యావసర సరుకుల ధరలను ఇష్టానుసారం పెంచుకుంటూపోతున్నది. ఫలితంగా పంటలు పండించే రైతులకే కాకుండా ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నది. రైతుల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వ తీరును రైతు సంఘాల నేతలు దుయ్యపడుతున్నారు.
అనుసంధానిస్తే 30శాతం మేలు
వ్యవసాయానికి జాతీయ గ్రామీణ ఉపాథి పథకాన్ని అనుసంధానిస్తే రైతులకు 30శాతం మేరకు మేలు జరుగుతుందని వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కపక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తూ తోడ్పాటునిస్తున్నది. పంటల సాగుకు ప్రధానమైన విద్యుత్ సరఫరాలను 24గంటల పాటు ఉచితంగా అందించడంతోపాటు వ్యవసాయ పెట్టుబడి కోసం ‘రైతుబంధు’ కింద సాయం అందిస్తున్నది. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ‘రైతు బీమా’ ద్వారా ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నది. సబ్సిడీ ద్వారా వ్యవసాయ పనిముట్లను మంజూరు చేస్తున్నది. కూలీల కొరత, నకిలీ విత్తనాలు, తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలు, పెరిగిన పంట పెట్టుబడులు వంటి అనేక ఇబ్బందులను రైతులు ఎదుర్కొంటున్నారు. ఇన్ని సమస్యలను ఎదుర్కొంటూ పంటలను సాగు చేస్తున్న రైతులకు మంచి చేయడానికి మాత్రం కేంద్రంలోని బీజేపీ ససేమిరా ఒప్పుకోవడం లేదు.
భద్రాద్రి జిల్లాలో 5.50 లక్షలకు పైగా పంటల సాగు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే సుమారు 5.50 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. వరితోపాటు పత్తి, మిర్చి, మొక్కజొన్న, వేరుశనగ, ఆయిల్‌పాం, కందులు, మినుములు ప్రధానంగా సాగవుతున్నాయి. జిల్లాలో రైతులే సుమారు 2 లక్షలకు పైగా ఉన్నారు. వీరితోపాటు మరో కౌలు రైతులు ఏటా పంటలను సాగు చేస్తున్నారు. రైతులు, కౌలు రైతులు పంటల సాగుకు అష్టకష్టాలు పడుతున్నారు. పెరిగిన ధరలతోపాటు కూలీల కొరత రైతులను వెంటాడుతూనే ఉంది. పంట పెట్టుబడి తగ్గాలన్నా, కూలీల కొరత ఎదుర్కోవాలన్నా వ్యవసాయానికి ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానమే సరైన మార్గమని రైతులు, రైతుసంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కేంద్రం సాయం అందించాలంటే ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం ద్వారా సాధ్యమవుతుందని సూచిస్తున్నారు.
కార్పొరేట్ సంస్థలకే బీజేపీ ఊడిగం
రైతులు, ప్రజల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. కేవలం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేయడానికే ప్రాధాన్యతనిస్తున్నది. రైతుకు మేలు చేసే వ్యవసాయాభివృద్ధి తోడ్పాటునివ్వడం లేదు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని నీతి ఆయోగ్ నివేదనను పరిగణనలోకి తీసుకోవాలి.
– కొక్కెరపాటి పుల్లయ్య, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, అశ్వారావుపేట
కేంద్రం పునరాలోచించాలి
వ్యవసాయరంగానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయడం ద్వారా రైతుకు ఎంతో మేలు జరుగుతుంది. కూలీల కొరత, పంట పెట్టుబడి తగ్గుతుంది. సకాలంలో వ్యవసాయ పనులు చేసుకునే వీలుంటుంది. ఉపాధి పనులకు కూలీలు వెళ్లడం వల్ల వ్యవసాయ పనులకు కొరత ఏర్పడుతున్నది. ఖర్చు కూడా పెరుగుతున్నది. వ్యవసాయానికి ఉపాధి పథకాన్ని అనుసంధానించడానికి కేంద్రం పునరాలోచించాలి.
– చిన్నంశెట్టి నాగేశ్వరరావు,
రైతు, అశ్వారావుపేట
వ్యవసాయానికి అనుసంధానించాలి
పంటలు పండించడానికి రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూలీల కొరత ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తూ చేయూతనిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతున్నప్పటికీ ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. రైతుకు మేలు చేయాలంటే వ్యవసాయ రంగానికి ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
– జూపల్లి రమేశ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్, అశ్వారావుపేట