అశ్వారావుపేట, మే 16 : ఓ రైతు భూమికి ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు రూ.లక్ష డిమాండ్ చేసిన డిస్కం ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గురువారం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జంగారెడ్డిగూడెంకు చెందిన కొనకళ్ల జనార్దన్‌రావుకు అశ్వారావుపేట మండలం మద్దికొండలో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమికి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు కనెక్షన్‌కు జనార్దన్‌రావు కుమారుడు ఆదిత్య అశ్వారావుపేట డిస్కం ఏఈ శరత్‌ను సంప్రదించాడు.
ఆయన సూచన మేరకు మీ సేవ కేంద్రంలో నెల రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకయ్యే ఖర్చు రూ.1.81 లక్షల ఎస్టిమేషన్ రుసుమును కూడా డీడీ రూపంలో ఆదిత్య చెల్లించాడు. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ నిర్మాణం, విద్యుత్ కనెక్షన్ కోసం మరో రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. లంచం ఇస్తానని చెప్పిన ఆదిత్య ఖమ్మంలోని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ నేతృత్వంలోని అధికారుల బృందం సూచన మేరకు లక్ష్మీతులసి పేపర్ మిల్లు సమీపంలో ఆదిత్య నుంచి ఏఈ శరత్ రూ.లక్ష లంచం తీసుకుంటుండగా..
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును సీజ్ చేసి ఏఈని కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ సోదాలు నిర్వహించిన అధికారులు పంచనామా చేసి ఏఈని అదుపులోకి తీసుకుని ఖమ్మం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రమేశ్ తెలిపారు. దాడుల్లో సీఐలు డి.సునీల్, ఎన్.శేఖర్, మహేశ్, హెడ్ కానిస్టేబుల్ పుల్లయ్య, సిబ్బంది రంగా, శ్రీను, శ్రీనివాసచారి పాల్గొన్నారు. కాగా.. లంచం ఇవ్వడం ఇష్టం లేకనే ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు బాధితుడు కొనకళ్ల ఆదిత్య తెలిపాడు.