ఇల్లెందు, ఏప్రిల్ 5: కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నేత దిండిగాల రాజేందర్ హితువు పలికారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో ఆదివారం నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు జగదాంబ సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ గజ్వేల్లో కేసీఆర్ క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ దుండగులు ధ్వంసం చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం శోచనీయమన్నారు. తెలంగాణ సాధకుడి కార్యాలయంపై దాడి అంటే యావత్ తెలంగాణ జాతి మీద జరిగిన దాడిగా అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ ఇలా చిల్లర రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు.
దాడికి పాల్పడిన కాంగ్రెస్ దుండగులను వెంటనే గుర్తించి, అరెస్టు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ జబ్బార్, ఎస్ రంగనాథ్, సిలివేరు సత్యనారాయణ, శీలం రమేష్, అబ్దుల్ నబీ, అజ్మీర బావ్సింగ్, 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య, సర్పంచ్ సుకనయ్య, డేరంగుల పోశం, సుందరగిరి శ్రీనివాస్, దాస్యం ప్రమోద్, ఘాజి, వాసు, లక్ష్మీనర్సయ్య, నారపాక వసంతరావు, సన్న రాజేష్, కొక్కు సరిత, నారాయణమ్మ, సత్యనారాయణ, మహేష్, రాచపల్లి శ్రీను, ఎం.ఉపేందర్, ఇమ్రాన్ లలిత్పాసి పాల్గొన్నారు.