ఇల్లెందు, ఆగస్టు 22 : డెభ్బైరెండు రకాల షెడ్యూల్డ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25 ఇల్లెందు లేబర్ ఆఫీస్, 29న జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు అబ్దుల్ నబి, తాళ్లూరు కృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం ఇల్లెందు ఆటో, మ్యాజిక్ అడ్డాలపై, ఆర్టీసీ డిపోలో కాంట్రాక్ట్ కార్మికులకు సమస్యలపై సర్వేలు నిర్వహించారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి వారు మాట్లాడారు. ఇల్లెందు పరిశ్రమలలో కాంట్రాక్ట్ కార్మికులు, షాపుల్లో పని చేస్తున్న గుమస్తాలు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, వివిధ రకాల షెడ్యూల్డ్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని, వాళ్లతో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తుందని దుయ్యబట్టారు.
ప్రభుత్వాలు కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని, వారికి న్యాయంగా రావాల్సిన వేతనాలు, సౌకర్యాలు కల్పించడంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. అందుకే షెడ్యూల్డ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయిన శేఖర్, శివ, రమేశ్, రాజు, మల్లేశ్, రమణ, నాగరాజు, దుర్గారావు, కృష్ణ పాల్గొన్నారు.