బోనకల్లు, ఏప్రిల్ 02 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఖమ్మం జిల్లా బోనకల్లు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో తాసీల్దార్ కార్యాలయం ముందు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలన్నారు.
అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని పరిశ్రమల స్థాపన పేరుతో కార్పొరేట్లకు దారాదత్తం చేయడాన్ని వెంటనే ఉపసహరించుకోవాలన్నారు. అనంతరం బోనకల్లు తాసీల్దార్ అనిశెట్టి పున్నం చందర్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ కార్యదర్శి వర్గ సభ్యుడు చింతలచెరువు కోటేశ్వరావు, జిల్లా కమిటీ సభ్యుడు దొండపాటి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కిలారు సురేశ్, పార్టీ మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శి, వివిధ ప్రజా సంఘాలు పాల్గొన్నారు.
CPM : ఆరు గ్యారంటీలను అమలు చేయలని బోనకల్లులో ధర్నా