మామిళ్లగూడెం, ఫిబ్రవరి 3: ధరణి సేవలను పూర్తి పారదర్శకంగా అందించాలని, వాటిపై ఫిర్యాదు రావొద్దని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. ధరణి సేవలు, భూసేకరణ, డబుల్ బెడ్ రూం ఇళ్ల పురోగతి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రేషన్ షాపులు, ప్రభుత్వ అవసరాలకు స్థలాల కేటాయింపు తదితర అంశాలపై గురువారం ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. పూర్తి చట్టబద్ధంగా అమలవుతున్న ధరణి పోర్టల్ ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 10 వేలకు పైగా పెండింగ్ మ్యుటేషన్ల దరఖాస్తులను పరిషరించినట్లు చెప్పారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి భూసేకరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మండలాల వారీగా ఖాళీగా ఉన్న రేషన్ షాపుల డీలర్ల వివరాలను సమర్పించాలన్నారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఆర్వో శిరీష, సర్వే ల్యాండ్ ఏడీ రాము, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ పాల్గొన్నారు.
జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలను అరికట్టేందుకు అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో సమగ్ర ప్రణాళికతో నియంత్రణ చర్యలను చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు సూచించారు. పోలీసు, పీఆర్, వ్యవసాయ, విద్య, వైద్య, అటవీ, ఔషధ నియంత్రణ జిల్లా అధికారులతో కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై చర్చించి పలు ఆదేశాలు జారీ చేశారు.