భద్రాచలం, డిసెంబర్ 17 : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం ధనుర్మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులు తెరిచి 3.30 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. గోదావరి జలాలను తీర్థపు బిందెతో తీసుకొచ్చారు. 4 గంటలకు ఆరాధన, ఆరగింపు, సేవాకాలం చేపట్టారు. 5 గంటలకు ఉత్సవ పెరుమాళ్లను, ఆండాళ్ అమ్మవారిని, కణ్ణన్ తండ్రిని బేడా మండపంలో వేంచేపు చేసి నివేదన జరిపారు. 6 గంటలకు తిరుప్పావైలోని 30 పాశురాలను వేద పండితులు విన్నవించారు. మంగళాశాసనం, శాత్తుమొరై, తీర్థగోష్టి జరిపారు. 7 గంటలకు సూర్యప్రభ వాహనంపై ఆండాళ్ తల్లిని వేంచేపు చేసి తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ జరిపారు.
సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు ప్రాకార మండపంలో తిరుప్పావై ప్రవచనం జరిపారు. పట్టణంలోని అహోబిల మఠంలో పొడిచేటి సీతారామానుజాచార్యులు తిరుప్పావై ప్రవచనం చేశారు. జీయర్ మఠంలో దేవస్థానం వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు ఉదయం 8.30 గంటలకు తిరుప్పావై, సేవాకాలం, గోష్టి తదితర కార్యక్రమాలు చేపట్టారు. సీతారామనగర్ కాలనీలో వేంచేసి ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో కూడా ధనుర్మాసోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు.