కారేపల్లి, అక్టోబర్ 3 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి)మండలం ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతర భక్తులతో కిటకిటలాడింది. విజయదశమిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇక్కడ ఐదు రోజులపాటు అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని జాతరలో కుటుంబ సమేతంగా ఆనందంగా గడుపుతారు.
దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ జాతరలో 150మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. పర్స ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతరలో పలు సౌకర్యాలు కల్పించారు. ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్, వైరా, ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యులు మాలోతు రాందాస్ నాయక్, కోరం కనకయ్యలతో పాటు పలువురు ప్రముఖులు,అధికారులు తరలి వచ్చి కోట మైసమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.