సత్తుపల్లి రూరల్, నవంబర్ 11: తెలంగాణలో మూడోసారి కూడా బీఆర్ఎస్దే అధికారమని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సహకారం, ఎమ్మెల్యే సండ్ర కృషి కారణంగా సత్తుపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో సండ్ర వెంకటవీరయ్య మూడుసార్లు సత్తుపల్లి ఎమ్మెల్యేగా గెలిచారని, మరోసారి ఆయనకు అవకాశం కల్పించి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు. సత్తుపల్లిలో శనివారం పర్యటించిన పార్థసారథిరెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యతో కలిసి కొత్తూరు గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న సండ్ర వెంకటవీరయ్యను ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కనివినీ ఎరుగని రీతిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న సండ్రను ఆదరించాలని పిలుపునిచ్చారు. అనంతరం సండ్ర మాట్లాడుతూ.. తాను నాన్ లోకల్ అంటూ ప్రతిపక్ష నేతలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 15 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న తాను నాన్ లోకల్ ఎలా అవుతానో వారే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కొత్తూరులోని 11 కుటుంబాల వారు ఎంపీ బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు గొర్ల సంజీవరెడ్డి, కూసంపూడి రామారావు, కూసంపూడి మహేశ్, కొత్తూరు ఉమామహేశ్వరరావు, దొడ్డా శంకర్రావు, ఒగ్గు విజయలక్ష్మి, ఒగ్గు శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి పురుషోత్తం, మందపాటి వెంకటరెడ్డి, తుమ్మూరు దామోదర్‌రెడ్డి, ఐనంపూడి సత్యనారాయణ పాల్గొన్నారు.