పూడిక, తూటికాడ, నాచు, పిచ్చిమొక్కలతో దర్శనమిచ్చి అందవిహీనంగా మారిన చెరువులు. నిల్వ నీటి సామర్థ్యం తగ్గి కుంటలను తలపించే తటాకాలు. శిథిలావస్థకు చేరిన తూము షెట్టర్లు. రివిట్మెంట్ లేక మట్టి కొట్టుకుపోయిన కట్టలు. ఏళ్లు గడిచినా.. ప్రభుత్వాలు మారినా చెరువుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. తెలంగాణ సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ ముందుచూపుతో చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేశారు. భద్రాద్రి జిల్లాలోని 2,354 చెరువుల అభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయించి తీర్చిదిద్దారు. వర్షాలతో జలకళను సంతరించుకున్న చెరువులు రైతులు రెండు పంటలు పండించుకునేలా లక్షల ఎకరాలకు సాగునీరందిస్తూ.. మత్స్యకారుల చేపల పెంపకానికి ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చెరువులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడంతో రైతులు సాగును పండుగలా చేస్తున్నారు.
-భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న చెరువులను తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం కింద పూర్తిస్థాయిలో బాగు చేసింది. పూడిక తీయించడంతోపాటు కట్టల ఎత్తు పెంచి తూములను మరమ్మతు చేయించింది. దీంతో వర్షాకాలంలో చేరిన నీటితో చెరువులు కొత్త కళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో ఆయకట్టు రైతులు ఏటా సాగు విస్తీర్ణం పెంచుకుంటూ రెండు పంటలు పండించుకుంటున్నారు. 2017లో 2లక్షల సాగు విస్తీర్ణం ఉన్న భద్రాద్రి జిల్లా ప్రస్తుతం 4,25,393 ఎకరాలకు చేరిందంటే జిల్లాలో చెరువుల అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం రైతులు పంట పెట్టుబడికి ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో రైతుబంధుతో సాయం అందించింది. చెరువులు, బావుల్లో నీరున్నా బోర్ల కింద పంట పండించునే రైతులకు కోతలు లేకుండా 24 గంటల విద్యుత్‌ను మోటార్ల కింద సాగు చేసుకునే విధంగా అందిస్తున్నది. జిల్లాలోని 2,354 చెరువుల్లో ఇటీవల కురిసిన వర్షాలకు చేరిన నీరు సాగుకు ఎంతో ఉపయోగపడుతున్నది. వేసవిలోనూ చెరువుల్లో నీరు నిల్వ ఉండడం వల్ల మత్స్యకారులు కూడా చేపలను పెంచుతూ ఆర్థిక ప్రగతి సాధిస్తున్నారు.
మిషన్ కాకతీయ చెరువులో ఏటా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. 2016-17 వరకు కేవలం మోటార్ల మీదనే ఆధారపడిన రైతులు నేడు మిషన్ కాకతీయ చెరువుల కింద సాగు పనులు ముమ్మరంగా చేసుకుంటున్నారు. ఏటా 50 ఎకరాల వరకు పంటల సాగును పెంచుకుంటూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. సుజాతనగర్ మండలంలో సింగభూపాలెం, అశ్వాపురం మండలంలో తుమ్మలచెరువు, చండ్రుగొండలో వెంగళరావు ప్రాజెక్టు, అశ్వారావుపేట మండలంలో వెంకమ్మ, ఇల్లెందులో రాగబోయినగూడెం చెరువు, పాల్వంచ రాతిచెరువు, దుమ్ముగూడెంలో గుబ్బలమంగి చెరువులు.. ఏటా ఆ చెరువులన్నీ రైతుల పంట పొలాలకు ఆసరాగా నిలుస్తున్నాయి. వర్షాకాలం సీజన్లో కాకుండా వేసవిలో వంద శాతం నీటి నిల్వ ఉన్న చెరువులు రెండు, 75 శాతం నీటిని ఇచ్చే చెరువులు ఐదు, 50 శాతం నీటిని ఇచ్చే చెరువులు 273, 25 శాతం నీటిని ఇచ్చే చెరువులు 2,074 ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అదే వానకాలంలో అన్ని చెరువుల్లో పుష్కలంగా నీరు ఉంటుంది.
రైతులకు ప్రభుత్వం అందించే 24 గంటల విద్యుత్ ఎంతగానో ఉపయోగపడుతున్నది. దీంతో రైతులు ఆరుతడి పంటలతోపాటు ఇతర పంటలు సాగు చేయడానికి మక్కువ చూపుతున్నారు. దిగుబడి ఎక్కువగా వచ్చే అపరాల పంటలను యాసంగిలో సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతర పంటలుగా కంది, పెసర సాగులో ఆయిల్‌పామ్ వేసి లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం ఆయిల్‌పామ్ గెలలకు గిట్టుబాటు ధర ఉండడంతో రైతులు ఆ పంట సాగుపై దృష్టి సారించారు. గతం కంటే ఎక్కువ ఎకరాల్లో ఈసారి ఆయిల్‌పామ్ తోటలను సాగు చేస్తున్నారు. గత ఏడాది 35,759 ఎకరాల్లో సాగు చేయగా.. ఈ ఏడాది 48,604 ఎకరాలకు సాగు చేరింది.
మిషన్ కాకతీయ కింద ప్రభుత్వం చెరువులను బాగు చేయడం బాగుంది. దీంతో ఎండా కాలంలోనూ బావులు, బోర్లలో నీరున్నదంటే అది ఈ పథకం వల్లే. వానకాలంలో చెక్‌డ్యాంలలో నీరు నిల్వడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. దీనికి తోడు 24 గంటల కరెంటు ఉండడం వల్ల ఎప్పుడు స్విచ్ వేసినా నీరొస్తున్నది. రైతుల సాగునీటి అవసరాలు తీరుతున్నాయి.
-పగడాల రాంరెడ్డి, రైతు, బీజీ కొత్తూరు, అశ్వాపురం మండలం
వేసవి కాలంలోనూ ఏ చెరువులో చూసినా నీరు ఉంటుంది. అందుకే రెండు పంటలు పండిస్తున్నాం. భూగర్భ జలాలు పెరగడానికి చెరువుల్లోని నీరే కారణం. అప్పుడు చెరువుల్లో తూటికాడ పెరిగి నీరు ఇంకిపోయేది. ఇప్పుడు ఏ చెరువులోనూ తూటికాడ లేదు. దీంతో నీరు నిల్వ ఉంటుంది. దీంతోపాటు చెక్‌డ్యాంలు కూడా నిర్మించారు. దీనివల్ల రైతులకు సాగునీటి సమస్య తప్పింది.
-జడ వెంకయ్య, రైతు, దామరచర్ల, చండ్రుగొండ మండలం
అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. అప్పుడు చెరువుల్లో నీరు ఉండేది కాదు. తూటికాడ చెట్లు బాగా పెరగడంతో నీళ్లు తగ్గేవి. తెలంగాణ ప్రభుత్వం మి-బి.అర్జున్, జిల్లా నీటిపారుదల శాఖ అధికారిషన్ కాకతీయ పథకం ప్రవేశపెట్టడం వల్ల చెరువుల్లో నీటి శాతం పెరిగింది. వేసవిలో కూడా పుష్కలంగా నీరు ఉంటుంది. చేపల పెంపకం బాగా పెరిగింది. రైతులు, మత్స్యకారులకు నీరు ఎంతో ఉపయోగపడుతున్నది. జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగిందంటే ఇది ప్రభుత్వ విజయమే.