కారేపల్లి, ఆగస్టు 28 : బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ (రామలింగాపురం)లో గురువారం వారు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సైడ్ కాల్వలు లేకపోవడం వల్ల వర్షాలు కురిసినప్పుడు గ్రామంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎంపీ, ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సైడ్ డ్రైనేజ్ నిర్మించేందుకు అంచనా వేసి తనకు పంపితే ఎంపీ నిధుల నుండి మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ సుపరిపాలనలో, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులను చేపట్టలేదని విమర్శించారు. కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెనుక బడిందన్నారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ ను గెలిపించుకుని గ్రామాలను అభివృద్ధి చేయించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి, ఎంపీపీ, ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు, కారేపల్లి క్రాస్ రోడ్ గ్రామస్తులు సురభి నరసింహారావు, కాంసాని వెంకన్న, షేక్ సైదులు, షేక్ మీరా సాహెబ్, అనుముల నరసయ్య, రంజాన్, బీఆర్ఎస్ యూత్ నాయకులు షేక్ ఖాజావలి, సురభి సాగర్, షేక్ పెద్ద పాషా, చిన్న పాషా, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు బట్టు శ్రీను, రేఖ ప్రసాద్, షేక్ సయీద్ జాన్, గుగులోతు భిక్షం పాల్గొన్నారు.