ఎర్రుపాలెం, ఆగస్టు 21 : ఇందిరమ్మ రాజ్యంలో రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం జమలాపురం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జమలాపురాన్ని రాష్ర్టానికే వన్నె తెచ్చే విధంగా.. పర్యాటకులు రెండు రోజులపాటు జమలాపురంలో గడిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. సాగర్ ఎడమ కాల్వ నుంచి అధికారికంగా తూము ఏర్పాటు చేయించి జమలాపురం చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మారుస్తామన్నారు.
ఎర్రుపాలెం మండలంలో మిగిలి ఉన్న రోడ్లను పూర్తి చేసి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా రోడ్డు నిర్మించి మండలం మొత్తం ఒక రింగ్ రోడ్డులా అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే మీనవోలు నుంచి బనిగండ్లపాడు వరకు రూ.1.70 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశానన్నారు. ఎర్రుపాలెం నుంచి పెగళ్లపాడు వరకు రూ.2.40 కోట్లు, కొత్తపాలెం నుంచి గట్లగౌరవరం వరకు రూ.20 కోట్లు,
ఎర్రుపాలెం వయా జమలాపురం నుంచి రాజుపాలెం వరకు రూ.25 కోట్లు, వెంకటాపురం నుంచి బనిగండ్లపాడు వరకు రూ.5 కోట్లు, బుచ్చిరెడ్డిపాలెం నుంచి వెంకటాపురం వరకు రూ.2.20 కోట్లు, నారాయణపురం నుంచి రాజుపాలెం వరకు రూ.95 లక్షలు, రాజుపాలెం నుంచి కొత్తపాలెం వరకు రూ.1.60 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు శీలం ప్రతాపరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు బండారు నరసింహారావు, శీలం శ్రీనివాసరెడ్డి, బొగ్గుల గోవర్ధన్‌రెడ్డి, అనుమోలు వెంకటకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.