మధిర/బోనకల్లు, నవంబర్ 7 : భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా నాణ్యతా ప్రమాణాలతో రోడ్ల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. చింతకాని, బోనకల్లు మండలాల్లో గురువారం పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చింతకాని మండలంలో రూ.8.90 కోట్ల వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బోనకల్లు మండల కేంద్రంలో రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలు, పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా జిల్లాలో రోడ్ల నిర్మాణం, వెడల్పు చేసే పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
సంబంధిత కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ సమయంలోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం పలు సమస్యలపై సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు వినతిపత్రాలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో నరసింహారావు, ఆర్అండ్బీ ఎస్ఈ హేమలత, ఈఈ జ్ఞానేశ్వర్, తహసీల్దార్ పొన్నం చందర్, ఎంపీడీవో రమాదేవి, ఎంఈవో పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.