మధిర రూరల్, ఆగస్టు 5 : నియోజకవర్గ కేంద్రమైన మధిరను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి తెలంగాణలో నెంబర్వన్ స్థానంలో నిలుపుతానని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం మధిర నియోజకవర్గంలో పర్యటించిన ఆయన యండపల్లిలో 84 ఎకరాల్లో రూ.45 కోట్లతో నిర్మించనున్న ఇండస్ట్రియల్ పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ మధిర పట్టణ విస్తరణకు కావాల్సిన బైపాస్ రోడ్లు నిర్మిస్తామన్నారు.
మధిర ప్రజల దశాబ్దాల కల అయిన ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు రూ.45 కోట్లు మంజూరు చేశామన్నారు. టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల పరిధిలోని దేశినేనిపాలెం, మడుపల్లి, రాయపట్నం, అల్లీనగరం గ్రామాల్లో సుమారు రూ.14.90 కోట్లతో నిర్మించనున్న రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఇండస్ట్రీయల్ పార్కు చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, ఈఈడీ కళ్యాణ్ చక్రవర్తి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.