వైరాటౌన్, ఆగస్టు 9 : మూడు నెలల్లో రూ.75 కోట్లతో పూర్తి చేసిన రాజీవ్ లింకు కెనాల్ ద్వారా ఈ నెల 15 నుంచి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వైరా నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా శుక్రవారం ఆయన రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ లింకు కెనాల్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల15న వైరాకు రానున్నారని వెల్లడించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీని వైరా వేదికగా ఈ నెల 15న అమలు చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సభకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
వైరా నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా డిప్యూటీ భట్టి విక్రమార్క శుక్రవారం రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా రూ.26.87 కోట్లతో మంచినీటి సరఫరా పథకానికి మున్సిపల్ కార్యాలయం ఎదుట శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన ఆయన కలియతిరుగుతూ శిథిల భవనాలను పరిశీలించారు. 200 మంది వరకు విద్యార్థులున్న కళాశాలలో ల్యాబ్‌లు, సరిపోయినన్ని తరగతి గదులు లేకపోవడాన్ని ప్రిన్సిపాల్ నవీన జ్యోతి భట్టి దృష్టికి తెచ్చారు. దీనికి ప్రతిపాదనలు పంపించాలని డీఐఈవో రవిబాబును ఆయన ఆదేశించారు. అనంతరం రూ.33 కోట్లతో వైరా రివర్ కెనాల్ ఆధునీకరణతోపాటు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఆ తర్వాత వైరాలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన ఆయన స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురం వెళ్లారు. శ్రీపార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం భట్టి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శివాలయం సమీపంలో రూ.65 లక్షలతో స్నానాల ఘాట్, రూ.4.20 కోట్లతో చెక్‌డ్యామ్, రూ.7.70 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం, రూ.3.20 కోట్లతో శ్రీపార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయం ప్రహరీ, కళ్యాణ వేదిక, అభిషేక మండపం, ఐదు గదుల సత్రం, జీ ప్లస్ వన్ డార్మెటరీ హాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
అనంతరం నాగ్‌పూర్ అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే వెహికిల్ అండర్‌పాస్ నిర్మాణాల గురించి అధికారులతో సమీక్షించారు. ఎంత మేరకు వీలైతే అన్నిచోట్ల రైతులకు సౌకర్యంగా ఉండే విధంగా అండర్‌పాస్ బ్రిడ్జిలు నిర్మించాలని హైవే అధికారులకు సూచించారు. తొలుత హైదరాబాద్ ప్రజా భవన్ నుంచి రోడ్డు మార్గాన వైరాకు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యం, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మున్సిపల్ చైర్మన్ జైపాల్ తదితరులు స్వాగతం పలికారు.