ఖమ్మం, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):జిల్లా నుంచి ఆర్థిక మంత్రి ఉన్నా.. జిల్లా ప్రజలకు మాత్రం ఆశాభంగమే మిగిలింది. రాష్ట్ర అసెంబ్లీలో జిల్లాకు చెందిన ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి జిల్లా ప్రజలకు నిరాశను మిగిల్చింది. ఆర్థిక మంత్రి ఎలాగూ మనవాడే కాబట్టి ఉమ్మడి జిల్లాకు వరాలు వర్షాల్లా కురుస్తాయనుకున్న ఇక్కడి ప్రజలకు నిరాశే ఎదురైంది. ప్రధాన రంగాలకు, ప్రజల డిమాండ్ల పద్దులో చోటు దక్కుతుందనేకుంటే.. కనీసం ఫలితం కూడా దక్కలేదు. చివరికి ఉసూరుమంటూ టీవీల ముందు నుంచి లేచారు. జిల్లాకు చెందిన మంత్రి కాబట్టి.. ఇక్కడి సమస్యలపై పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి.. బడ్జెట్లో తగిన ప్రాధాన్యం ఉంటుందని అందరూ భావించారు.
కానీ ఎక్కడా అలాంటి ప్రాధాన్యం లేదు. విద్య, వైద్యం, నీటిపారుదల రంగాల ఊసేలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణకుగానీ, వైద్య కళాశాలల నిర్మాణాలకుగానీ నిధులు కేటాయించిన జాడేలేదు. సీతారామ ప్రాజెక్టుకు కేవలం రూ.650 కోట్లు కేటాయించి కొంత ఉపశమనం కల్పించడం తప్ప ఇంకెక్కడా నిధుల మాట లేదు. పాలేరు నియోజకవర్గంలోని సీతారామ లింక్ కెనాల్ ఏర్పాటు, మద్దులపల్లి జేఎన్టీయూ కళాశాల నిర్మాణాలకు రూ.500 కోట్లు అవసరమైనప్పటికీ వాటిని విస్మరించడం పట్ల జిల్లాలోని రాజకీయ వర్గాలు విస్మయానికి గురయ్యాయి.
భద్రాద్రి రామయ్యకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారనుకున్న రామభక్తుల ఆశలు అడియాశలయ్యాయి. పాలేరు నుంచి పర్ణశాల వరకు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రణాళిక ఆచరణకు నోచుకోలేదు. గిరిజనుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే ఐటీడీఏకి పూర్వ వైభవమూ లేదు. విశ్వవిద్యాలయాల ఊసు, విద్యారంగానికి నిధులు లేకపోవడంతో విద్యార్థి సంఘాలు ఖమ్మంలో ఆందోళన చేపట్టాయి. పాలేరు, వైరా, లంకాసాగర్, తాలిపేరు, పెద్దవాగు ప్రాజెక్టుల ఆధునీకరణకు నిధుల కేటాయింపుపై ప్రజల్లో చర్చ జరిగినా అది చర్చగానే మిగిలిపోయింది. పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2,500 సాయం వంటి వాటిపై ప్రకటనలూ లేవు. తాజా బడ్జెట్‌పై జిల్లా ప్రజలే కాదు.. పార్టీ నేతలూ పెదవి విరవడం గమనార్హం.

కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిన మాటలకు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులకు అసలు సంబంధమే లేనట్లుగా కన్పిస్తోంది. ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంతా ఒట్టిగానే కన్పిస్తోంది. మహాలక్ష్మి పథంలో ప్రతి మహిళకూ నెలకు రూ.2,500 ఇస్తామన్న వాగ్దానం ప్రస్తావన బడ్జెట్లో లేనేలేదు. నిరుద్యోగ భృతి, రైతు కూలీలకు రూ.12 వేలు వంటి హామీలకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. సామాజిక పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామన్న హామీని బడ్జెట్లో పూర్తిగా విస్మరించారు. లబ్ధిదారులను మోసగించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల చొప్పున వేతనాలు ఇస్తామని హామీని కూడా తుంగలో తొక్కారు. రుణమాఫీ గురించి గొప్పలు చెప్పినా ఆచరణలో అంతా మోసమే కన్పిస్తోంది.
– మెచ్చా నాగేశ్వరరావు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే
దళితులకు ప్రయోజనం చేకూర్చే దళితబంధు పథకం ప్రస్తావన రాష్ట్ర బడ్జెట్లో లేకపోవడం దారుణం. కనీసం ఆ పథఖం గురించి మాట్లాడకపోవడం బాధాకరం. రాష్ట్రంలో అత్యంత పేదరికంలో మగ్గుతున్న దళితులకు ఆర్థికంగా చేయూతనిచ్చి వారి బతుకుల్లో మార్పు రావాలనే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని చేపట్టింది. దశలవారీగా ఆ పథకాన్ని అమలు చేస్తూ వచ్చింది. అయితే ఈ పథకం కింద కేసీఆర్ ప్రభుత్వం అందించిన రూ.10 లక్షల సాయాన్ని తాము రూ.12 లక్షలకు పెంచుతామంటూ ఇటీవల ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించింది.
-మోత్కూరి శ్రీకాంత్, బీఆర్ఎస్ ఎస్సీ సెల్, దుమ్ముగూడెం
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తాజా బడ్జెట్లో పేదల సంక్షేమం గురించిన ప్రస్తావనే లేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో పేదల కోసం, కుల,చేతివృత్తిదారుల కోసం రూ.వేల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో యాదవులకు చేయూతనిచ్చే పథకాల ఊసే లేదు. దళితులకు దళితబంధు పథకం మాటే లేదు. ఇలా పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపింది. ఎన్నో లక్షల కుటుంబాల వారు వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. వారిలో ఏ ఒక్కరికీ వారి వృత్తులపై భరోసా కల్పించలేదు. మాటలు, అంకెలు తప్ప ఈ బడ్జెట్లో ఏమీలేదు. అంతా గారడీలా ఉంది.
-మందడపు అశోక్‌కుమార్, సర్పంచ్ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు, పెనుబల్లి
తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం ప్రకటించిన రాష్ట్ర బడ్జెట్లో బ్రాహ్మణులను పూర్తిగా విస్మరించింది. గత కేసీఆర్ ప్రభుత్వం బ్రాహ్మణ పరిషత్ ద్వారా ఏటా రూ.వంద కోట్ల నిధులను కేటాయించేంది. వీటిని బ్రాహ్మణుల సంక్షేమం కోసం, బ్రాహ్మణుల్లోని పేద విద్యార్థుల కోసం, వేద బ్రాహ్మణుల వ్యాపారం కోసం వెచ్చించేది. కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు కేటాయించడాన్ని విస్మరించింది. బ్రాహ్మణ సంక్షేమం కోసం బడ్జెట్లో కనీసం ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం బాధాకరం. ఇప్పటికై బ్రాహ్మణుల అవసరాలను గుర్తించి నిధులు కేటాయించాలి.
– కొడిమల అప్పారావు, బ్రాహ్మణ సంఘం సత్తుపల్లి మండల అధ్యక్షుడు
రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. అనేక వాగ్దానాలతో మొత్తానికి అధికారంలోకి వచ్చింది. కానీ గురువారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆ ఆరు గ్యారెంటీల అమలుకు కేటాయించిన నిధులను చూస్తే గాడిద గుడ్డే గుర్తువస్తోంది. ఆరు గ్యారెంటీల అమలుకు తగిన నిధుల ఊసేలేదు. బడ్జెట్ కేటాయింపులకు ఆదాయం ఎక్కడ నుంచి వస్తుందో లెక్కాపత్రం లేదు. రైతుల పంటరుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేయలేదు. 90 లక్షల తెల్లరేషన్‌కార్డులు ఉంటే 39 లక్షల మందికే గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రభుత్వమే చెప్పడం దారుణం. రైతుభరోసా పెట్టుబడిగానీ, రూ.500 బోనస్గానీ, పంటల పరిహారం గానీ ఎప్పడు చెల్లిస్తారో చెప్పనేలేదు.
-పాలకొల్లు శ్రీనివాసరావు, బీజేపీ సత్తుపల్లి మండల అధ్యక్షుడు
తమది ప్రజా ప్రభుత్వమంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీ, గిరిజనులకు సంపూర్ణమైన బడ్జెట్‌ను కేటాయించలేదు. రాష్ట్రంలో బడ్జెట్లో మొత్తంలో జనాభా నిష్పత్తి ప్రాతిపదికన ఆదివాసీ, గిరిజనులకు రూ.29, 119 కోట్లు కేటాయించాలి. కానీ ఎస్టీ, ఎస్డీఎఫ్ కింద రూ.17.05 కోట్లు మాత్రమే కేటాయించింది. కేటాయించాల్సిన నిధులన్నింటికీ కోత పెట్టింది. 500 మంది జనాభా ఉన్న తండాలకు రెవెన్యూ పంచాయతీల హోదా కల్పిస్తామనే మాటనే ఆర్థికమంత్రి తన ప్రసంగంలో పొందుపర్చలేదు. ప్రతీ తండా పంచాయతీ అభివృద్ధికి రూ.కోటి చొప్పున నిధులు కేటాయించాలి.
-భూక్యా శ్రీనివాస్, గిరిజన సమాఖ్య భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు దశదిశ లేదు. మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు రూ.2,500 చొప్పున ఇస్తామని గతంలో మాట ఇచ్చారు. ఈ బడ్జెట్లో దాని గురించి మరిచారు. ఆరు గ్యారెంటీలను గంగలో కలిపారు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసాకార్డు అంటూ చెప్పి దానికీ మంగళం పలికారు. రూ.4 వేల భృతి ఇస్తారన్న ఆశతో ఉన్న నిరుద్యోగులకు నిరాశే మిగిల్చారు. రైతుబంధు మాట, దళితబంధు ఊసు ఎక్కడా లేవు. తెలంగాణలోని సబ్బండ వర్గాల ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన బడ్జెట్‌లా ఇది మిగిలిపోతుంది.
-బొమ్మెర రామ్మూర్తి, బీఆర్ఎస్ నాయకుడు, మధిర
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెలే కన్పిస్తున్నాయి. అసలు ఈ బడ్జెట్ ఆచరణ సాధ్యంగా లేదు. రూ.వేల కోట్లు అప్పుల్లో ఉన్న రాష్ట్రం.. ప్రతి నెలా రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వరకూ వడ్డీలే కట్టాల్సిన పరిస్థితి. ఆదాయ వనరులు లేకుండా బడ్జెట్లో అంకెలు కూర్చినట్లుగానే కన్పిస్తోంది. అంకెల కూర్పుతో ఆచరణ సాధ్యం కాదు. వ్యవసాయానికి పెద్దపీట వేసినట్లు చెబుతున్నా.. ఎక్కడా అది కన్పించడం లేదు. రైతులకు రూ.2 లక్షల వరకూ ఒకేసారి రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం.. చాలామందికి ఇంకా చేయలేదు. అది కూడా రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేసినా.. కొద్దిమంది రైతుల రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయి. మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
-గోగినపల్లి ప్రభాకర్, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్, పాల్వంచ డివిజన్
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగిందేమీలేదు. పూర్తిగా పేదల సంక్షేమాన్ని విస్మరించింది. బడ్జెట్లో అధిక భాగం నిధులను హైదరాబాద్‌కే కేటాయించడం దారుణం. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ పేదలకు పెద్దపీట ఎక్కడా కన్పించలేదు. ఒకవిధంగా చెప్పాలంటే పేదలకు అన్యాయం జరిగినట్లుగానే ఉంది. పేదల సంక్షేమ కోసం కేటాయించింది పిసరంతే. ఆరు గ్యారెంటీల అమలుకు నిధుల ప్రసక్తే లేదు. కొత్త పథకాల ఊసేలేదు. దళితబంధుకు హామీ లేదు. మహిళలకు కూడా పెద్దగా ప్రయోజనం లేదు.
– మానె రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకుడు, భద్రాచలం
కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో యాదవులను, మత్స్యకారులను పట్టించుకోలేదు. మహిళల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ బడ్జెట్లో వారికి సంబంధించిన ఏ ఒక్క పథకానికీ నిధులు కేటాయించలేదు. అంటే వారి ఓట్లతో వారినే దారుణంగా మోసగించినట్లు లెక్క. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగమంతా రాజకీయ ప్రసంగంలానే ఉంది. గొర్రెల పెంపకందారులకు ఈ ప్రభుత్వం మొండిచేయి చూపించింది. దళితబంధు ప్రస్తావనే లేదు. ప్రజల ఆశలపై బడ్జెట్ నీళ్లు చల్లింది. అంకెల గారడీ తప్ప మరేమీ లేదు.
-నూనె హరిబాబు, బీఆర్ఎస్ నాయకుడు, వేంసూరు
తెలంగాణను మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి చేపట్టాల్సిన భారీ కర్మాగారాలు, పరిశ్రమల మాటే లేకుండా ప్రస్తుత బడ్జెట్ ఉంది. కేవలం గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ రద్దుచేయడం కోసమే అన్నట్లుగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంది. సంక్షేమ పథకాలు ఊసు ఎక్కడా లేదు. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అయోమయంగా ఉంది తప్ప ఆలోచింపజేసేలా లేదు.
-తేజావత్ తావునాయక్, పెనుబల్లి మాజీ సర్పంచ్
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను బడ్జెట్లో ప్రవేశపెట్టకపోవడాన్ని ప్రజలను మోసగించినట్లుగానే భావించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఆర్థిక ప్రగతికి దోహదం చేసిన గత ప్రభుత్వ పథకాలకు ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం శోచనీయం. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా జిల్లాకు అవసరమైన నిధుల కేటాయింపు లేకపోవడం హాస్యాస్పదం. జిల్లాకు విశ్వవిద్యాలయం మంజూరు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. బడ్జెట్లో ఆ ఊసే ఎత్తలేదు. సాగునీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించకపోవడం రైతులను నిరాశకు గురిచేసింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలకు సరైన ప్రాధాన్యత కల్పించకపోవడం సరికాదు.
-ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల గారడీలు తప్ప మరేమీ లేవు. కేవలం ప్రజలను మోసం చేసే బడ్జెట్లానే ఉంది. లెక్కలు చూపెట్టారు తప్ప ప్రయోజనం చేకూర్చలేదు. ప్రజలను వంచించినట్లు స్పష్టంగా కన్పిస్తోంది. అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ వాగ్దానాలను అమలు చేసేందుకు బడ్జెట్లో కేటాయింపులను చూపలేదు. హామీలను పూర్తిగా మర్చిపోయింది. మహిళలకు రూ.2500 ఇస్తానని చెప్పి మోసం చేసింది. దళితబంధు, యాదవులకు గొర్రెల పంపిణీ వంటి పథకాలను పక్కనబెట్టింది. ప్రజలకు అవసరమైన అనేక అంశాలు బడ్జెట్లో లేనేలేవు. పైగా లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చూపించి ప్రజలకు నిరాశ కల్పించారు. బడ్జెట్లో రాష్ట్ర ప్రజలకు గుండు సున్నానే మిగిలినట్లుగా కన్పిస్తోంది.
-రేగా కాంతారావు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే
శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పస లేదు. జిల్లా ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదు. గత కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన పథకాలను యథావిధిగా కొనసాగిస్తూనే మళ్లీ అవే పథకాలను తాము తెచ్చామంటూ చెప్పుకుంటుండడం విడ్డూరంగా ఉంది. బడ్జెట్ ప్రసంగం ప్రజలకు ఉపయోగపడేదిలా కాకుం డా.. పార్టీ మీటింగ్‌లా ఉంది. ఇందులో గత ప్రభుత్వాన్ని విమర్శించడం ఇంకా విచిత్రంగానూ, విడ్డూరంగానూ ఉంది. ప్రజాప్రయోజనాలే అంటూ మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల గురించి ఈ బడ్జెట్లో ప్రస్తావించకపోవడం శోచనీయం. ఇలాంటి పసలేని బడ్జెట్‌తో మహిళలు, యువతీయువకులు, నిరుద్యోగులకు మొండిచేయి చూపించారు. మధిర నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో అమలైనప్పటికీ ప్రస్తుత ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిగా ఉన్న ఇక్కడి ఎమ్మెల్యే భట్టి.. ఇక్కడి దళితులకు ఆ పథకాన్ని అందించే కృషిచేయకపోవడం దారుణం.
-లింగాల కమల్‌రాజు, జడ్పీ చైర్మన్, ఖమ్మం