మణుగూరు టౌన్, ఏప్రిల్ 21 : భూ వ్యవహారం కేసులో బాధితుల పేర్లు చేర్చకుండా చేసేందుకు రూ.లక్ష డిమాండ్ చేసి లంచం తీసుకుంటుండగా సీఐతోపాటు ఓ టీవీ రిపోర్టర్‌ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన మణుగూరు పోలీస్‌స్టేషన్‌లో సోమవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మణుగూరులోని ప్రభుత్వ భూమిలో అక్రమ వెంచర్లు చేసి క్రయవిక్రయాలు జరిపిన విషయంలో రెవెన్యూ అధికారులు పూర్తి విచారణ చేసి.. అందుకు బాధ్యులైన వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ భూమిని కొనుగోలు చేసి ప్రస్తుతం అందులోనే నివాసం ఉంటున్న వారిపై కేసు కూడా నమోదైంది. అయితే ఆ భూమిని విక్రయించిన వారిపై కేసు నమోదు కాలేదు.
దీనిని ఆసరా చేసుకున్న సీఐ సోమ సతీశ్‌కుమార్ సదరు భూమిని విక్రయించిన వారిని బ్లాక్మెయిల్ చేశారు. కేసు నంబర్ 150/2025, సెక్షన్లు 318(4), 329(3) బీఎన్ఎస్, తెలంగాణ స్టేట్ గేమింగ్(సవరణ) చట్టం సెక్షన్ 5 కింద నమోదైన కేసుకు సంబంధించి బేరసారాలు చేశారు. ఈ కేసులో బాధితుల పేర్లు చేర్చకుండా చేసే యత్నంలో భాగంగా రూ.4 లక్షలు డిమాండ్ చేయగా.. ఈ వ్యవహారంలో బిగ్ టీవీ రిపోర్టర్ మిట్టపల్లి గోపి మధ్యవర్తిగా వ్యవహరించారు. ‘మీరు రూ.4 లక్షలు ఇవ్వకపోతే మీపై కూడా కేసు నమోదు చేస్తాం’ అని బెదిరించారు. అయితే తాను ఒకరికి రూ.3 లక్షలు బాకీ ఉన్నానని, ఇందులో రూ.3 లక్షలు వారికి చెల్లించి, మిగిలిన రూ.లక్ష తనకు ఇవ్వాలని సీఐ చెప్పారు.
ఇందుకు అంగీకరించిన బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించి సీఐ లంచం వ్యవహారం విషయాన్ని వివరించారు. వారు పన్నిన పథకం ప్రకారం.. రూ.లక్ష లంచం ఇచ్చేందుకు బాధితులు సోమవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడంతో ఆ సమయంలో మరో పనిపై సీఐ బయటకు వెళ్లారు. మధ్యవర్తి గోపి ఆ నగదును తనకు ఇవ్వాలని చెప్పి తీసుకున్న తర్వాత ఏసీబీ అధికారుల సమక్షంలోనే ఈ విషయాన్ని ఫోన్ ద్వారా సీఐకి కూడా చెప్పాడు. ఇదంతా రికార్డు చేసిన ఏసీబీ అధికారులు సీఐని, రిపోర్టర్ గోపిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి పూర్తి ఆధారాలతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.