తిరుమలాయపాలెం/ ఎర్రుపాలెం/ ఇల్లెందు, మే 4: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, సీపీఎం, తెలంగాణ రైతు సంఘం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం, ఎర్రుపాలెం, ఇల్లెందు మండలాల్లో రైతులు సోమవారం ఆందోళనలు చేపట్టారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు వద్ద ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రెండు గంటలపాటు రోడ్డును దిగ్బంధించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, రైతులు మాట్లాడుతూ.. 20 రోజుల క్రితం మక్కలు, వడ్లను అమ్మకానికి కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొస్తే..
ఇంతవరకు బస్తాలు ఇవ్వలేదని, కాంటాలు వేసి గోదాములకు కూడా తరలించలేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. విషయం తెలుసుకున్న ఎస్సై జగదీశ్, ఏవో సీతారాంరెడ్డి, డీటీ సుధీర్ అక్కడికి చేరుకొని రైతులతో చర్చించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే ధాన్యం తరలిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెం వద్ద సీపీఎం అనుబంధ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు రోడ్డుపై బైఠాయించి మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలిపి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం, సీపీఎం నాయకులు దివ్వెల వీరయ్య, మద్దాల ప్రభాకరరావు మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలంలో కేవలం ఒక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారని మండిపడ్డారు.
ఇక్కడ గోనె సంచులు, లారీలు, గోడౌన్లు ఖాళీ లేవని అధికారులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఇల్లెందు మండలంలో అకాల వర్షాలకు మామిడి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఇల్లెందు తహసీల్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్టీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు మాట్లాడుతూ.. పంట చేలు, కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్నలు వర్షానికి తడిచిపోయాయని, చేతికొచ్చిన మామిడి కాయలు నేలపాలై రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరంతహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చారు. ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పంటలను కొనండి

Khammam
మధిర/ బోనకల్లు/ అశ్వాపురం/ ఇల్లెందు/ చింతకాని, మే 4: వాతావరణ మార్పుల దృష్ట్యా ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లాలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో రైతులు సోమవారం ధర్నాలు నిర్వహించారు. మధిర వ్యవసాయ మార్కెట్ ఎదుట బీఆర్ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. టౌన్ సీఐ రమేశ్, మార్కెట్ చైర్మన్ నర్సింహారావు అక్కడికి చేరుకొని రైతులను శాంతింపజేశారు.
కల్లాలు, యార్డుల్లో పంటను వెంటనే కాంటాలు వేస తరలించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. షరతులు విధించకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అశ్వాపురం మండలం మొండికుంట ప్రధాన రహదారిపై బీఆర్ఎస్, సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ఇల్లెందు మండలం కొమరారం మక్కల కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు చేపట్టడం లేదని ఆరోపిస్తూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. వారికి సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. తమ మక్కలు కొనుగోలు చేయకుండా కేవలం వ్యాపారులు తెచ్చిన సరుకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. కొమరారం ఎస్సై నాగుల్ మీరా జోక్యం చేసుకొని వారిని శాంతింపజేశారు.
బోనకల్లు మండలం చిరునోముల గ్రామానికి చెందిన రైతులు బోనకల్లు-ఖమ్మం ప్రధాన రహదారిపై మొక్కజొన్న బస్తాలు వేసి ధర్నా నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. ఎస్సై వెంకన్న రైతుల వద్దకు చేరుకొని కొనుగోళ్లు చేపట్టేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నలు తరలించడం లేదని ఆరోపిస్తూ రైతులు చింతకాని సొసైటీ కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. దీంతో విషయం తెలుసుకున్న తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ అక్కడికి చేరుకొని రైతులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు.