న్యూఢిల్లీ : ఈ-20 ఇంధనంతో నా వెహికల్ మైలేజీ పడిపోయిందని ఒకరు.. ఇంజిన్ పాడైందని మరొకరు.. సోషల్ మీడియాలో ఇలా పలు వీడియోలు వైరలవుతున్నాయి. ఈ-20 పెట్రోల్ వాడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. మరి ఈ-20 పెట్రోల్ వాడొచ్చా.. వెహికల్స్ ఎందుకు పాడవుతున్నాయి.. అంటే అందుకు ప్రధాన కారణం ఇంధనం కలుషితం కావడమే. ఇథనాల్‌కు ఉన్న హైగ్రోస్కోపిక్ స్వభావం లేదా వాతావరణంలోని తేమను ఆకర్షించే గుణం వల్ల వర్షాకాలంలో, తీరప్రాంతాల్లో తమ వద్ద ఉన్న ఈ-20 ఇంధన నిల్వలు కలుషితమవుతున్నాయని పెట్రోల్ పంప్ యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత భూగర్భ నిల్వ ట్యాంకులు కేవలం సాధారణ పెట్రోల్‌ను నిల్వ చేయడానికి మాత్రమే రూపొందించబడ్డాయని, ఇంతటి అధిక మోతాదులో ఇథనాల్ మిశ్రమం ఉన్న ఇంధనాన్ని నిల్వ చేయడానికి తగినవి కాకపోవడమే దీనికి ప్రధాన కారణమని వారు చెప్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వీడియోల ఆధారంగా ఈ ఆందోళనలు తెరపైకి వచ్చాయి. ఆ వీడియోలలో పెట్రోల్ పంపుల నుంచి ఈ-20 ఇంధనానికి బదులుగా బురద రంగులో ఉన్న నీటిలాంటి ద్రవం వస్తున్నట్టుగా కనిపించింది. అటువంటి ఒక వీడియోలో టయోటా హైక్రాస్ వాహనం కూడా ఉంది. ఈ ఘటనపై వాహన తయారీ సంస్థ స్పందిస్తూ.. తమ వాహనంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని, ఆ కారు ఈ-20 ఇంధనానికి అనుకూలమైనదేనని స్పష్టంచేసింది. ఇంధనం కలుషితం వల్లే అలా జరిగిందని తేల్చిచెప్పింది.
ఈ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక నిపుణుడు వివరిస్తూ.. “ఇంధనాన్ని భద్రపరిచే భూగర్భ ట్యాంకుల్లోకి తరచుగా వర్షపు నీరు చేరడం లేదా వాతావరణంలోని తేమ ఘనీభవించడం, అలాగే ఇంధనాన్ని సరఫరా చేసే ట్యాంకర్ల ద్వారా కొంతమేర నీరు చేరడం సర్వసాధారణం. అయితే భూగర్భ ట్యాంకులోని మొత్తం ఈ-20 ఇంధనంలో నీటి శాతం 0.5 శాతం దాటినప్పుడు ఇథనాల్ తన హైగ్రోస్కోపిక్ స్వభావం వల్ల నీటి అణువులతో బంధాన్ని ఏర్పరుచుకుంటుంది. దీనివల్ల ఫేజ్ సెపరేషన్ జరుగుతుంది. ఈ ప్రక్రియలో నీరు-ఇథనాల్ మిశ్రమం ట్యాంక్ అడుగుభాగానికి చేరుకోగా, పెట్రోల్ మాత్రం పైన ప్రత్యేకమైన పొరలా నిలిచిపోతుంది” అని తెలిపారు. పెట్రోల్ డిస్పెన్సింగ్ యూనిట్లు భూగర్భ ట్యాంకుల అడుగుభాగం నుంచి ఇంధనాన్ని లాగుతాయని, అందువల్ల కొన్ని వాహనాల్లోకి కేవలం ఈ-20 ఇంధనానికి బదులుగా ఈ నీరు, ఇథనాల్ మిశ్రమం వెళ్లే ప్రమాదం ఉన్నదన్నారు.