రఘునాథపాలెం, ఆగస్టు 25 : రవాణా శాఖలో పెంచిన సర్వీస్ చార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేటు ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ కార్మికులు ఖమ్మంలోని ఆర్టీవో కార్యాలయం ఎదుట సోమవారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు తుమ్మా విష్ణు మాట్లాడుతూ రవాణా శాఖలో సర్వీస్ చార్జీలు పెంచడం దుర్మార్గమైన చర్య అని, ఇది కార్మికులకు గుదిబండగా మారిందని ఆరోపించారు.
ఉచిత బస్సు పథకం తీసుకొచ్చి ఆటో కార్మికుల జీవితాలను రోడ్డున పడేశారని, ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని దుయ్యబట్టారు. అనంతరం ఏఎంవీఐ స్వర్ణలతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఉపేందర్, సీఐటీయూ జిల్లా నాయకుడు ధరావత్ రాందాస్, నాయకులు బొట్ల సాగర్, వనం వీరభద్రం, రాములు, రెడ్డి, నరేశ్, వేణు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.