ఖమ్మం, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో డిగ్రీ విద్య డీలా పడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో వేల సంఖ్యలో సీట్లు ఉన్నప్పటికీ.. వందలు, పదుల సంఖ్యలో కూడా ప్రవేశాలు జరగడం లేదు. అధ్యాపకులు, సిబ్బంది కొరత; వసతుల లేమి వంటివి అక్కడ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులు నిలిచిపోవడంతో సింహభాగం ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఇప్పటికే మూతపడ్డాయి. ఉన్నవాటిల్లో కొన్ని ప్రవేశాల కోసం పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. ఇక, తక్షణ ఉపాధి అవకాశాల కోసం సర్కారు కళాశాలల్లో ప్రభుత్వం కొన్ని భిన్న కోర్సులను ప్రారంభించింది.
ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల సందడి మొదలైంది. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో కళాశాలల నిర్వహణ భారంగా మారి ప్రైవేట్ కళాశాలలు మూతపడుతున్నాయి. ఆర్థిక స్థిరత్వం ఉన్న కొన్ని కళాశాలలు మాత్రం ఇంకా ప్రవేశాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వందల సంఖ్యలో సీట్లు ఉంటే పదుల సంఖ్యలో మాత్రమే సర్కారు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. దీంతో డిగ్రీ విద్య డీలా పడిపోతోంది. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ సైతం విడుదల కావడంతో ఈసారి పోటీ మరింత పెరిగింది. సంప్రదాయ కోర్సులతోపాటు మార్కెట్ అవసరాలకు తగిన నూతన కోర్సులను ప్రవేశ పెట్టి విద్యార్థులను ఆకర్షించేందుకు కళాశాలలు రంగంలోకి దిగాయి.
ప్రభుత్వ, ప్రైవేట్, అటానమస్ కళాశాలలు అన్నీ ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ఎక్కువమంది విద్యార్థులను తమవైపు తిప్పుకోవడం కోసం మాటలు వల్లె వేస్తున్నాయి. కరపత్రాలు, భారీ బ్యానర్లు, సోషల్ మీడియా క్యాంపెయిన్ల వంటి అన్ని మార్గాల ద్వారా ప్రచారం చేస్తున్నాయి. ఇంటర్ పాసైన విద్యార్థులను తమ కళాశాలల్లో చేరమంటూ ప్రభుత్వ కళాశాలలన్నీ జూనియర్ కళాశాలల బాట పట్టాయి.
విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే తమ కళాశాలల్లో ఉన్న సౌకర్యాలు, అధ్యాపకలు, ఇతర ప్రత్యేకతలను వివరిస్తూ క్యాంపెయిన్ సాగిస్తున్నాయి. పెద్ద అటానమస్ కళాశాలల నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న సాధారణ డిగ్రీ కళాశాలల వరకూ అన్నీ కలిసి విద్యార్థుల దృష్టిని ఆకర్షించేందుకు సామాజిక మాధ్యమాలను కూడా ఉపయోగించుకుంటున్నాయి. అధ్యాపకులు కూడా బృందాలుగా ఏర్పడి ప్రచారం చేస్తున్నారు. తమ కళాశాలల్లో చేరాలంటూ జూనియర్ కళాశాలల విద్యార్థులను ఆహ్వానిస్తున్నారు.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో 10 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 40 వరకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. మార్కెట్ అవసరాల కోసం సాగుతున్న రోజులు, సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు ఎప్పటికప్పుడు విభిన్న కోర్సులను ఉన్నత విద్యామండలి డిగ్రీ స్థాయిలో విద్యార్థులకు అందుబాటులోకి తెస్తోంది. వీటిల్లో కొన్ని కళాశాలల్లో ఉపాధిని కల్పించేందుకు అప్రెంటీస్ షిప్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
ఇప్పుడు డిగ్రీ చదవబోయే విద్యార్థులకు అటానమస్ కళాశాల, న్యాక్ అక్రిడిటేషన్ పొందిన కళాశాలలు విభిన్న కోర్సులను అందిస్తున్నాయి. హెల్త్ కేర్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్, గ్రాఫిక్ డిజైన్, డిజిటల్ అడ్వర్టయిజింగ్, ఈ-కామర్స్ తదితర కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అటానమస్‌గా మారి నాణ్యమైన విద్యను అందించేందుకు కష్టపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇతర ప్రాంతాల్లోని అధ్యాపకులను నగరంలోని కళాశాలలకు డిప్యూటేషన్‌పై కేటాయించినా సరిపోయేంత అధ్యాపకులు లేని పరిస్థితి. కొన్ని కళాశాలలకు తగినన్ని మౌలిక సదుపాయాలు లేవు. బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. డిగ్రీ చదువుతూనే అప్రెంటీస్‌షిప్ చేసే కోర్సులు రావడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగయ్యే అవకాశం కూడా ఉందని విద్యావేత్తలు, బోధనలో అనుభవం ఉన్న నిపుణులు పేర్కొంటున్నారు.