పట్నా: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా, వామపక్ష విద్యార్థి సంఘాలు శనివారం బీహార్‌లో తలపెట్టిన బంద్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పలు జిల్లాల్లో విద్యార్థులు, పోలీసులు ఘర్షణ పడ్డారు. పట్నా, సారన్, సివాన్, ఔరంగాబాద్, భాగల్పూర్ జిల్లాల్లో ఆందోళన హింసాత్మకంగా మారింది.
పట్నాలోని డాక్ బంగ్లా చౌరస్తా వద్ద ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేసి, కొందరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. భాగల్పూర్లో ఆందోళనకారులు పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు. ఔరంగాబాద్‌లో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పోలీసులు, ఒక జర్నలిస్టు గాయపడ్డారు.