అందం, అభినయం పుష్కలంగా ఉన్నా అంతగా అదృష్టం లేని హీరోయిన్లలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. పక్కా తెలుగు అమ్మాయే అయినా తమిళంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నది. మాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో బీజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించినా ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి. తాజాగా తిరువీర్‌తో కలిసి నటించిన ‘ ఓ.. సుకుమారి!’ విడుదలై థియేటర్లలో సందడి చేస్తున్నది. ఈ సందర్భంగా ముట్టుకుంటే షాక్ కొట్టే దామిని పంచుకున్న కార్వాన్ కబుర్లివి..
‘నువ్వు చాలా సాధారణంగా కనిపిస్తున్నావు హీరోయిన్ మెటీరియల్ కాదు’ అని చాలామంది ఆడిషన్లలో రిజెక్ట్ చేశారు. ఆ మాటలు నన్ను బాధపెట్టినా వెనక్కి మాత్రం తగ్గలేదు. క్రమంగా మంచి కథలను ఎంచుకుంటూ నటిగా నిరూపించుకున్నాను. తమిళంలో వచ్చిన ‘క పే రణసింగం’ సినిమా నా కెరీర్లో కీలక మలుపు. ఈ సినిమాలో తల్లి పాత్ర చేయడం పెద్ద సాహసమనే చెప్పాలి. విజయ్ సేతుపతి ప్రోత్సాహం వల్లే ఆ పాత్రకు న్యాయం చేశాను.
ఎనిమిదేళ్లకే తండ్రి ప్రేమకు దూరమయ్యాను. పెద్దాయ్యక ఇద్దరు అన్నయ్యలను కోల్పోయాను. మా మేనత్త శ్రీలక్ష్మి నన్ను చేరదీసింది. నాన్న, మేనత్త ఇద్దరూ సినీ నటులే కావడం మూలంగా నటనపై ఆసక్తి పెరిగింది. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించాను. ‘అవగాళమ్ ఇవర్గలం’ సినిమాతో వెండితెరకు వచ్చా.
పల్లెటూరు, స్వచ్ఛమైన ప్రేమ, కడుపుబ్బా నవ్వించేదే.. ‘ఓ.. సుకుమారి!. ఊరంతా భయపడే ఒక విచిత్రమైన సమస్య ఉన్న క్యారెక్టర్ నాది. ముట్టుకుంటే కరెంట్ షాకే కొట్టే దామిని పాత్రలో అందరికీ గుర్తిండిపోతాను. ఇక తిర్వీర్ గురించి.. ఆయన నటన ఎంతో సహజత్వంతో ఉంటుంది.
మూవీ సక్సెస్ అయితే మన ఆత్మీయులు మనకు గిఫ్ట్ ఇస్తుంటారు కదా. కానీ, ప్రతి సినిమాకు నాకు నేనే ఓ గిఫ్ట్ కొనుక్కుంటాను. ఇప్పటివరకు అలా కొన్నవాటిలో అత్యంత ఖరీదైన గిఫ్ట్ నా చేతి వాచ్. దీని ధర రూ.15 లక్షలు. సంక్రాంతికి వస్తున్నాం మూవీకి గుర్తుగా దీన్ని తీసుకున్నాను. ప్రతి మూవీకి గిప్ట్ కొనడం ఒక అలవాటుగా మారింది.
ఇప్పటివరకు నేను 35 సినిమాల్లో నటించాను. అయితే ఆ 35 సినిమాలకు రాని గుర్తింపు ఒక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో లభించింది. ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. ఇందులో నా పాత్ర పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కనెక్ట్ అయ్యింది. ఇలాంటి రోల్ నాకు ఇచ్చిన అనిల్ రావిపూడికి రుణపడి ఉంటాను.
తెలుగులో నేను బాలనటిగా నటించాను. రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన ‘రాంబంటు’లో బాలనటిగా కనిపించాను. తిరిగి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ఆయన కూతురిగా ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చి మీ అందరికి పరిచయమయ్యాను.