ఖమ్మం, ఆగస్ట్టు 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో రైతులకు రూ.2 లక్షల బీమా పథకం వ్యవహారం రగడ సృష్టిస్తున్నది. బోర్డు మీటింగ్‌లో చర్చించి బీమా పథకంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. డీసీసీబీ చైర్మన్ దృష్టికి వెళ్లకుండానే సీఈవో టెండర్ల ప్రక్రియ, ఇన్స్‌రెన్స్ కంపెనీల ఎంపిక పూర్తి వరకు తీసుకొచ్చారని పలువురు డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్న ఈ వ్యవహారం నాలుగు జిల్లాల పీఏసీఎస్ బాధ్యులను ఇబ్బంది పెడుతున్నది.
ఖమ్మంలోని జిల్లా బ్యాంకులో శనివారం జరిగిన సబ్ కమిటీ సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండాగా మారినట్లు తెలుస్తున్నది. ఖమ్మం డీసీసీబీ.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతోపాటు మహబూబాబాద్, ములుగు జిల్లాలకు విస్తరించింది. దీని పరిధిలో 100 సహకార సంఘాలు ఉండగా.. మరో 50 డీసీసీబీ బ్రాంచీలు రైతులు, ఖాతాదారులకు విస్తృత సేవలు అందిస్తున్నాయి. అయితే గత ఐదు నెలల నుంచి డీసీసీబీ వ్యవహారం నిత్యం అనేక వివాదాలను మూటగట్టుకుంటున్నది. బ్యాంకు ప్రతిష్టను మసకబారే స్థితికి తీసుకొస్తున్నది.
ఇదే పాలకవర్గంలో చైర్మన్‌గా పనిచేసిన కూరాకుల నాగభూషణంపై వీవీపాలెం సొసైటీలో అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల ఆయన సొసైటీ చైర్మన్‌తోపాటు డీసీసీబీ చైర్మన్ పదవిని కోల్పోయారు. దీంతో బ్యాంకు ఉపాధ్యక్షుడిగా ఉన్న దొండపాటి వెంకటేశ్వరరావు ఇన్చార్జి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. గత మార్చి నెలలో డీసీసీబీ జనరల్ బాడీ సమావేశం(మహాజన సభ) జరిగింది. దీనికి హాజరైన సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు సొసైటీలలో సభ్యత్వం కలిగిన రైతులకు ప్రస్తుతం ఉన్న రూ.50 వేల బీమాను రూ.2 లక్షల వరకు వర్తింపజేయాలని కోరారు. అప్పుడే 11వ తీర్మానంగా రూ.2 లక్షల వరకు రైతులకు బీమా కల్పించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
నాటి డీసీసీబీ చైర్మన్ పదవి కోల్పోయిన తర్వాత కొత్త అధ్యక్షుడిగా దొండపాటి వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే పాలకవర్గ సభ్యులు వర్సెస్ చైర్మన్ వర్గాలుగా విడిపోయారు. ఖాళీగా ఉన్న డీసీసీబీ డైరెక్టర్ల ఎన్నిక, నూతన చైర్మన్ ఎంపికకు బోర్డు మీటింగ్‌లో తీర్మానం చేయాలని మెజార్టీ డైరెక్టర్లు పట్టుబట్టడం, వారి అభ్యంతరాలను పక్కదోవ పట్టించడం పరిపాటిగా మారింది. మూడు వరుస సమావేశాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో డీసీసీబీ పాలకవర్గంలో తీవ్ర పొరపొచ్చాలు వచ్చాయి. అయితే డీసీసీబీలో నెల రోజుల నుంచి ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది.. ప్రస్తుత పాలకవర్గం వర్సెస్ బ్యాంకు యంత్రాంగంగా ముఖచిత్రం మారింది.
దీంతో సీఈవో తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని చైర్మన్ బహిరంగంగానే తప్పుబడుతున్నారు. ఉద్యోగుల పదోన్నతుల నుంచి రైతుల బీమా సౌకర్యం అమలు వరకు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్లు డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. రూ.2 లక్షల బీమాకు తాము వ్యతిరేకం కాదని, కాకపోతే బోర్డు మీటింగ్‌లో మారోసారి చర్చించి కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుందంటున్నారు. అయితే దీనికి భిన్నంగా సీఈవో రెహమాన్ టెండర్ల ప్రక్రియ, ఇన్సూరెన్స్ కంపెనీల ఎంపిక పూర్తి వరకు కనీసం చైర్మన్ దృష్టికి తీసుకురాలేదని వాపోతున్నారు. ఇలా అనేక నిర్ణయాలను అధికారులు బైలా ప్రకారం చేస్తున్నారా.. లేదా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారా.. అనేది రాష్ట్ర టెస్కాబ్ అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది.
డీసీసీబీ బోర్డు సమావేశం ఈ నెల 5న చైర్మన్ అధ్యక్షతన జరగనున్నది. గడిచిన నాలుగైదు నెలల నుంచి డీసీసీబీలో జరుగుతున్న ప్రతి వ్యవహారంపై చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తున్నది. కొత్త చైర్మన్, డైరెక్టర్ల ఎంపికకు తీర్మానం చేసే అవకాశం కూడా ఉంది. అంతేకాక బ్యాంకు ఉన్నతాధికారులు పాలకవర్గాన్ని పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ఉన్నందున వారిపై చర్యలు చేపట్టాలని తీర్మానం చేసే అవకాశం కూడా ఉంటుందని పాలకవర్గ సభ్యుల ద్వారా తెలుస్తున్నది. ఏదేమైనా మరో ఐదు రోజుల్లో డీసీసీబీలో జరగబోయే బోర్డు సమావేశం అత్యంత కీలకంగా మారబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.