ఖమ్మం వ్యవసాయం, మార్చి 13 : చేపల పెంపకంతో తాము ఉపాధి పొందడంతోపాటు పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి ఎం.విజయనిర్మల అన్నారు. నగరంలోని రైతు శిక్షణ కేంద్రంలో బుధవారం ‘చేపపిల్లల పెంపకం-యాజమాన్య పద్ధతులు’ అనే అంశంపై జరిగిన శిక్షణా కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో యువత చేప పిల్లలను అభివృద్ధి చేసి వాటి విక్రయం ద్వారా ఉపాధి పొందవచ్చన్నారు.
చేపలతోపాటు రొయ్యలు, ఆక్వేరియంలో పెంచే అలంకరణ చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. గ్రామీణ యువతకు చేపల పెంపకంపై ఆరు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవికుమార్ చేపల పెంపకంపై మత్స్య రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. వారి సమస్యను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాసరెడ్డి, డి.రామకృష్ణ, శరత్, రాజేశ్, టి.అరుణజ్యోతితోపాటు ఆయా మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.