పాడి రైతులపై కాంగ్రెస్ సర్కారు విషం జిమ్ముతున్నది. పశుసంపదను పెంచుతూ పాలను ఉత్పత్తి చేస్తున్న రైతులకు మోకాలడ్డుతున్నది. కేసీఆర్ సర్కారు హయాంలో ప్రతి పదిహేను రోజులకే పాలబిల్లులు వచ్చేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండునెలలుగా పాలబిల్లులు చెల్లించకపోవడంతో పాడి రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 400 మంది పాడి రైతులు పాలను సేకరించి పాలకేంద్రానికి విక్రయిస్తున్నారు. ఇలా విక్రయించిన పాలకు ప్రతి 15 రోజులకు బిల్లులు ఇవ్వాలి. బిల్లులు ఇస్తేనే వారు రైతులు వద్ద గ్రామాల్లో సేకరించిన పాలను పాలకేంద్రానికి సరఫరా చేసే అవకాశం ఉంటుంది. రూ.10 లక్షల బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడం వల్ల పాడిరైతులు ‘విజయ డెయిరీ’కి పాలు పోయాలంటేనే జంకుతున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో నాలుగు వేలమందికి పైగా రైతులు గేదెలు, ఆవులను సాదుకుంటున్నారు. కొంతమంది ఇంటి అవసరాలకు పశువులను పెంచుకుంటుంటే.. మరికొంతమంది స్థానికంగా పాలను విక్రయించి మిగిలిన పాలను పాలకేంద్రాలకు విక్రయిస్తున్నారు. పాలను సేకరణ చేసిన పాడిరైతులు నేరుగా కేంద్రానికి వెళ్లి పాలను సరఫరా చేస్తారు. ఇలా సరఫరా చేసిన పాలను పాలకేంద్రం అధికారులు ‘విజయ డెయిరీ’కి పంపిస్తారు. ప్రతి పదిహేను రోజులకు పాలబిల్లులు ఆ రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. కాని ప్రస్తుతం దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. దీంతో రైతులు పాలసేకరణపై ఆసక్తి చూపడం లేదు.
జిల్లాలో ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం, చండ్రుగొండ, ములకలపల్లి, సుజాతనగర్ మండలాల నుంచి పాడిరైతులు పాలకేంద్రానికి పాలు పోస్తున్నారు. ఇప్పటివరకు రైతులందరికీ కలిసి రూ.10 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. రైతులు మాత్రం ఇంకా ఎక్కువ బిల్లులు రావాలని చెబుతున్నారు. ఒక్కో మండలం నుంచి రెండునెలలకు నాలుగుబిల్లులు రావాల్సి ఉందని చెబుతున్నారు.
రెండునెలల నుంచి బిల్లులు రావడం లేదు. ఊర్లో రైతుల వద్ద పాలను తీసుకుని పాలకేంద్రానికి పోస్తున్నాము. ఒక్కసారే సొమ్ములు వస్తాయనుకుంటే ప్రభుత్వం మొత్తానికే మోసం చేస్తున్నట్లు అనిపిస్తున్నది. రూ.50 వేల వరకు బిల్లులు రావాలి. బిల్లులు రాకపోవడం వల్ల పాలను కూడా తగ్గించాం. స్థానికంగా అమ్ముకోవాల్సి వస్తున్నది.
– జజ్జూరి ఈశ్వర్, నర్సాపురం, ములకలపల్లి మండలం
తెల్లవారుజామునే లేచి పాలను సేకరించి కేంద్రానికి పంపే మాకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్ పెట్టడం సరికాదు. పాడిమీద బతికేటోళ్లం.. మేమెలా బతకాలి. కేసీఆర్ హయాంలో ప్రతి 15 రోజులకు బిల్లులు వచ్చేవి. రేవంత్ సర్కార్ వచ్చాక బిల్లులు రావడం లేదు. నాకు మొత్తం నాలుగు బిల్లులు రూ.1.60 లక్షలు రావాలి. కేంద్రానికి వెళ్లి అడిగితే ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదన్నారు. ఇలా అయితే పాలసేకరణ చేయలేం. చిన్న రైతులు నా వద్దకు వచ్చి పాలు పోస్తారు. ఆ పాలను నేను కేంద్రానికి పంపుతాను. వెన్నశాతం తగ్గించి రేటు నిర్ణయిస్తారు. దానివల్ల రేటు తగ్గినా బిల్లులు సకాలంలో వస్తే ఇబ్బంది ఉండదు. నెలలు తరబడి బిల్లులు వాళ్ల వద్ద ఉంచుకుంటే పాడి రైతుల కష్టాలు ఎవరితో చెప్పుకోవాలి. ఇలాంటి పద్ధతి మంచిది కాదు.
– కోటేశ్వరరావు, పాడి రైతు, సుజాతనగర్ మండలం
నాకు రూ.లక్షా యాభై వేల బిల్లులు రావాల్సి ఉంది. రైతులందరం కలిసి ఆందోళన చేయాలని అనుకున్నాం. పాడిరైతులందరం ఒకతాటిపై ఉన్నాం. బిల్లుల కోసం ఆందోళనబాట పడుతున్నాం. లోకల్లో 50మంది రైతులు నాకు పాలు పోస్తున్నారు. అందరి తరఫున ఒక్కరమే పాలు కేంద్రానికి పంపిస్తున్నాం. రైతులు డబ్బుల కోసం ఆగలేరు. గేదెల పోషణ చాలా ఇబ్బందిగా మారింది.
– చామకూరి ప్రభాకర్‌రావు, జగన్నాథపురం, ములకలపల్లి