ఇల్లెందు/ భద్రాచలం/ మణుగూరు టౌన్, అక్టోబర్ 17: భద్రాద్రి జిల్లాలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవైజ్ కార్మికులు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 36 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఆయా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతిపత్రాలు అందజేశారు.
ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సీఐటీయూ నాయకుడు అబ్దుల్ నబీ మాట్లాడుతూ.. పది నెలలుగా వేతనాలు లేక కార్మికులు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లెందు మండలం రొంపేడు గిరిజన ఆశ్రమ పాఠశాల ఎదుట చేస్తున్న సమ్మెకు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అభిమన్యు మద్దతు తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సీపీఎం నాయకుడు గడ్డం స్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం దిగి రాకపోతే ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. మణుగూరులోని పినపాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట కార్మికులు బైఠాయించి ధర్నా చేశారు.