మిగ్జాం తుపాను ఉమ్మడి జిల్లా రైతాంగాన్ని తీరొక్క విధంగా నష్టపరిచింది. కోతకొచ్చిన వరి, మిర్చి, పత్తి పంటలను నీటిపాలు చేసింది. చెరుకు, మొక్కజొన్న, పొగాకు, వేరుశనగ, కూరగాయల పంటలను దెబ్బతీసింది. కల్లాలు, రోడ్ల వెంట, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వరి ధాన్యాన్ని తడిపి ముద్ద చేసింది. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేసిన వ్యవసాయాధికారులు ఖమ్మం జిల్లాలో 53 వేల మంది రైతులకు చెందిన 83 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. భద్రాద్రి జిల్లాలోనూ 60 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అక్కడి వ్యవసాయ శాఖ అధికారులు కొద్ది రోజుల క్రితమే ప్రాథమిక నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు అందజేశారు. కోతకొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఇప్పటికీ దిగులు చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని, పరిహారం, సాయం అందించాలని ఉమ్మడి జిల్లా రైతులు కోరుతున్నారు.
ఖమ్మం, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొద్ది రోజుల క్రితం తీరం దాటిన మిగ్జాం తుపాన్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ విధ్వంసం సృష్టించింది. అప్పట్లో మూడురోజులపాటు విస్తారంగా వర్షా లు కురవడంతో కల్లాల వద్ద ఉన్న పంటలతోపాటు, కోతకు వచ్చిన పం టలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు గా 83 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టవ వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు నివేదికను సిద్ధం చేశారు. ఇందులో 53 వేల మంది రైతులకు తీవ్రనష్టం వాటిల్లినట్లు తేలింది. ఇక భద్రాద్రి జిల్లాలోనూ మరో 60 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అక్కడి వ్యవసాయ శాఖ అధికారులు కొద్ది రోజుల క్రితమే ప్రాథమిక నివేదికను రూపొందించారు. అనంతరం పూర్తి వివరాలతో మరో నివేదికను సిద్ధం చేశారు. తుది నివేదిక ప్రకారం ఖమ్మం జిల్లాలో 39,926 మంది రైతులకు చెందిన వరి పంట 55,522 ఎకరాల్లో, 2,232 మంది రైతులకు చెందిన మక్క పంట 3,938 ఎకరాల్లో, ఒక రైతుకు సంబంధించి మిను ము పంట 2 ఎకరాల్లో దెబ్బతిని నష్టం వాటిల్లినట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లాలో 5,298 రైతులకు చెందిన వరి పంట 8,816 ఎకరాల్లో, 323 మంది రైతులకు చెందిన మక్క పంట 585 ఎకరాల్లో, 464 మంది రైతులకు చెందిన వేరుశనగ పంట 1,607 ఎకరాల్లో, 1,285 మంది రైతులకు చెందిన మిర్చి పంట 2,475 ఎకరాల్లో, 80 మంది రైతులకు చెందిన పత్తి పంట 130 ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్నాయి. మొత్తంగా ఖమ్మం జిల్లా రైతులకు సుమారుగా రూ.490 కోట్లు, భద్రాద్రి జిల్లా రైతులకు సుమారుగా మరో రూ.110 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. వానకాలం సాగు చేసిన పంటల్లో కేవలం పెసర పంట మాత్రమే ఇప్పటికి చేతికి వచ్చినట్లయింది. వరి పంట కొంతమేర చేతికొచ్చింది. మిగిలిన వరి పంటతోపాటు పత్తి, మిర్చి పంటలు పొలాల్లో ఉండగానే తుపాన్ రావడంతో ఆ పంటలన్నీ నాణ్యత కోల్పోయాయి. దీంతో మార్కెట్లో వాటి ధరలు కూడా తగ్గిపోయాయి. కోతకు వచ్చిన వరి పూర్తిగా నేల వాలడంతో రైతులు ఇప్పటికీ ఆందోళనలోనే ఉన్నారు. కల్లాల వద్ద ఉంచిన పంట కూడా పూర్తిగా తడిసిముద్దయింది.
చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో అన్నదాతల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాము ఆరుగాలం కష్టించి పంటను చేతికి తెచ్చుకుంటే ప్రకృతి తమకు తీరని నష్టం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ తగిన న్యాయం చేయాలని, పరిహారంగానీ, సాయంగానీ అందించాలని కోరుతున్నారు.