భద్రాచలం/ పర్ణశాల, నవంబర్ 10: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సెలవుదినంతోపాటు కార్తీకమాసం కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.
క్యూలైన్లలో భక్తులు గంటల కొద్దీ వేచి ఉన్నారు. కార్తీకమాసంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున పవిత్ర గోదావరి తీరానికి వస్తున్నారు. అక్కడ స్నానాల అనంతరం స్వామివారిని దర్శించుకోవడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడింది. రామాలయంతోపాటు అనుబంధ ఆలయాలు సైతం భక్తులతో రద్దీగా మారాయి. అలాగే, ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల దేవాలయంలో కూడా ఆదివారం భక్తులు రద్దీ పెరిగింది. ఇక్కడి పంచవటి, నారచీరెల ప్రాంతాలను సందర్శించారు.