ఆరుగాలం శ్రమించిన అన్నదాతలను అకాల వర్షం శోక సంద్రంలోకి నెట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షం.. కర్షకులకు తీవ్రమైన కష్టనష్టాలను మిగిల్చింది. పంట కాలపు రెక్కల కష్టానికి రెండు మూడు రోజుల్లో ఫలితం వస్తుందనుకుంటున్న సమయంలో అకాల వర్షం వచ్చింది. కోలుకోలేని విధంగా కర్షకులను దెబ్బతీసింది. వివిధ మండలాల్లోని పలు పంటలు పూర్తిగా వర్షార్పణమయ్యాయి.
కల్లాల్లో ఆరబోసి ఉన్న ధాన్యం, మిర్చి, మక్కల రాసులు వరదపాలయ్యాయి. ఈదురుగాలుల కారణంగా పలు కల్లాల్లో ధాన్యంపై కప్పిన పరదాలు చెల్లాచెదురయ్యాయి. దీంతో వర్షపు నీటితో ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. ఇక కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మరికొన్ని చోట్ల పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. ఇంకొన్ని చోట్ల ఏపుగా ఎదిగిన పంటలు కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయి.
-నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 16
మంగళవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్నదాతలను అతలాకుతలం చేసింది. కాంటాలకు సిద్ధంగా ఉన్న ధాన్యం కొందరిది, కోతలు పూర్తయి ఆరబెట్టిన ధాన్యం మరికొందరిది, బస్తాలకు ఎత్తి కాంటాకు సిద్ధంగా ఉంచిన ధాన్యం ఇంకొందరిది. ఇలా.. సరిగ్గా రెండు మూడు రోజుల్లో తమ కష్టానికి తగిన ప్రతిఫలం చేతికొస్తుందనుకున్న సమయంలో.. ఒక్కసారిగా వచ్చిన అకాల వర్షం హలధారులనందరినీ నట్టేట ముంచింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో వచ్చిన వర్షం.. ఆ సమయంలో కర్షకుల కంటి మీద కునుకు లేకుండా చేసింది. తెల్లవారితే చాలు.. కాంటాలు కాగానే నగదు చేతికొస్తుందనుకున్న సమయంలో వచ్చిన ఈ అకాల వర్షం.. అన్నదాతల ఆశలను ఆవిరిచేసింది.
కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో కాంటాలకు సిద్ధంగా ఉన్న ధాన్యంపై అడుగు మేర నీళ్లు చేరడంతో అన్నదాతలు ఆ నీళ్లను బకెట్లతో ఎత్తి బయట పోశారు. అర్ధరాత్రి కావడంతో ఎక్కువమంది రైతులు ఆరబెట్టిన ప్రదేశాలకు చేరుకోలేకపోయారు. ఖమ్మం రూరల్ మండలంలో కొద్దిరోజుల క్రితమే నాలుగు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. గన్నీబ్యాగుల కొరత, కాంటాల ప్రక్రియ ఆలస్యం కారణంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాసులు పోటెత్తాయి. అర్ధరాత్రి మొదలైన వర్షాన్ని కూడా లెక్కచేయకుండా అనేకమంది రైతులు తమ ఇళ్లకు చాలాదూరం ఉన్న కొనుగోలు కేంద్రాల వద్దకు చీకటిలోనే చేరుకున్నారు.
ధాన్యంపై కప్పేందుకు అక్కడ టార్పాలిన్లను కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచకపోవడంతో నెత్తీనోరూ బాదుకున్నారు. తాము తెచ్చుకున్న కొద్దిపాటి పరదాలను తమ పంటలపై కప్పి వాటిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. తిరుమలాయపాలెం, దుమ్ముగూడెం మండలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వడ్లు రాలిపోయాయి. మధిర, బోనకల్లు, చింతకాని మండలాల్లో మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతిన్నది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్న పంటలు కూడా తడిచిపోయాయి. బూర్గంపహాడ్ మండలంలో కొనుగోళ్లు ఆలస్యమవుతుండడంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రేయింబవళ్లూ కాపలా ఉంటున్నారు.
ఇప్పటికే అక్కడ నాలుగైదు సార్లు వర్షానికి ధాన్యం తడిచిపోవడంతో మరోసారి వర్షం వచ్చినా కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అశ్వారావుపేట, దమ్మపేటల్లో గడిచిన పది రోజులుగా రోజు విడిచి రోజు వర్షం కురుస్తూ రైతులకు తీవ్రమైన నష్టాన్ని మిగుల్చుతోంది. మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి, వీచిన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు కూలాయి. దీంతో సరఫరా నిలిచిపోయింది. చెట్లు కూడా విరిగిపడ్డాయి. ఇక చేతికొచ్చిన మొక్కజొన్న పంట నీటిపాలైంది. మామిడి, పొగాకు, మునగ, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పలువురి ఇళ్లు దెబ్బతిన్నాయి. పై కప్పులు ఎగిరిపోయాయి.