బూర్గంపహాడ్, మార్చి 28 : కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం కర్షకులకు తీరని కష్టాన్ని, పూడ్చలేని నష్టాన్ని తెచ్చిపెట్టింది. పొట్టదశకు వచ్చిన పంటలకు సకాలంలో నీటి తడి ఇవ్వకపోతే అవి ఎండిపోతాయని అన్నదాతలు విన్నవించినా సర్కారు పెడచెవిన పెట్టింది. ఫలితంగా పంటలన్నీ నిలువునా ఎండిపోయాయి. దీంతో తాము ఒక్కో ఎకరా నికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకూ నష్టపోయామంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా, తమ శ్రమ కూడా వృథా అయిందంటూ కంటతడి పెడుతున్నారు.
బూర్గంపహాడ్ మండలం నకిరిపేట పరిధిలోని దోమలవాగు ఆయకట్టు కింద సుమారు 200 మంది రైతులు యాసంగి వరిని సాగుచేస్తున్నారు. అయితే, ఇటీవల పంట పొట్ట దశకు వచ్చినప్పటికీ దోమలవాగు ఆయకట్టుకు ప్రభుత్వం ఇంకా సాగునీటిని విడుదల చేయలేదు. దీంతో తమ పంటలు ఎండిపోతాయన్న భయాందోళనతో ఆయకట్టు రైతులందరూ వెళ్లి గత నెల 19న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును, ఇరిగేషన్ అధికారులను కలిశారు. సమస్యను వివరించారు.
సీతారామ కాలువ ద్వారా దోమలవాగు చెరువుకు నీటి తడిని అందించాలని విన్నవించారు. అయితే, అప్పటికే దోమలవాగు చెరువుకు మరమ్మతులు చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం, అధికార యంత్రాంగం అలసత్వం వహించడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనిని కారణంగా చూపి సదరు చెరువుకు సకాలంలో నీటిని విడుదల చేయలేదు. దీంతో ఈ చెరువు నీటి మీద నమ్మకంతో దాని ఆయకట్టు కింద యాసంగి పంటలు వేసిన రైతులకు తీరని నష్టం వాటిల్లింది. నెమ్మదిగా ఎమ్మెల్యే వచ్చి ఇరిగేషన్ అధికారులతో కలిసి ఇటీవల నీటిని విడుదల చేయడంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరికి అన్నదాతలకు అప్పులు మిగిలాయి. అయితే, కనీసం 15 రోజుల ముందుగానైనా నీటి తడిని అందించి ఉంటే తమ పంటలు తమకు దక్కేవని అన్నదాతలు అంటున్నారు.
మండలంలోని దోమలవాగు చెరువు ఆయకట్టు పరిధిలో అంజనాపురం గ్రామానికి చెందిన తేజావత్ నరసింహారావు 5 ఎకరాలు, తేజావత్ లక్పతి రెండెకరాలు, బాదావత్ తారాసింగ్ ఎకరం, వర్సా పొట్టెమ్మ ఎకరం, వర్సా బాలయ్య ఎకరం, పోలవరానికి చెందిన బానోత్ వనిత ఎకరంన్నరతోపాటు మరికొందరు రైతులు ఈ యాసంగిలో వరి పంటలను సాగు చేస్తున్నారు. అయితే తేజావత్ నర్సింహారావు సాగు చేసిన ఐదెకరాల్లో మూడు ఎకరాల పంట పూర్తిగా ఎండిపోయింది.
ఒక్కో ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయామని, పంట పొట్ట దశలో ఉన్నప్పుడే నీటి తడి అందించి ఉంటే బాగుండేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో సాగునీరు అందని కారణంగా ఇంకా చాలామంది రైతులు తమ పంటలను నష్టపోయారని అంటున్నారు. బోర్లు ఉన్న రైతుల పంటలు మాత్రమే కాస్త చేతికొచ్చాయని చెబుతున్నారు. అయితే, రైతులు విన్నవించినప్పటికీ సాగునీటిని సకాలంలో ఎందుకు విడుదల చేయలేదన్న అంశంపై వివరణ కోరేందుకు సీతారామ ప్రాజెక్టు, ఇరిగేషన్ అధికారులను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా.. వారు అందుబాటులోకి రాలేదు.
దోమలవాగు ఆయకట్టు కింద నేను ఐదెకరాల్లో వరి పంట సాగు చేశాను. సకాలంలో నీటితడులు అందని కారణంగా అందులోని మూడు ఎకరాల పంట పూర్తిగా ఎండిపోయింది. సకాలంలో నీటిని విడుదల చేయాలంటూ ఆయకట్టు రైతులందరమూ మణుగూరు వెళ్లి మా ఎమ్మెల్యేను కలిసి విన్నివించాం. అయినా, నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోయాయి. సుమారు రూ.1.20 లక్షల వరకు నష్టపోయాను.
-తేజావత్ నర్సింహారావు, రైతు, అంజనాపురం
నాకున్న రెండెకరాల్లో యాసంగి వరి వేశాను. 20 రోజుల వరకు పంట పొట్టదశకు చేరుకొని బాగానే ఉంది. కానీ, ఆ తరువాత సరైన సమయంలో నీటితడులు అందలేదు. దీంతో ఇప్పుడు పంట పూర్తిగా ఎండిపోయింది. ఆయకట్టు రైతుల పంటలన్నీ ఎండిపోయాక ఇటీవల ఎమ్మెల్యే, అధికారులు వచ్చి నీటిని విడుదల చేశారు. కానీ, అప్పటికే నష్టం జరిగిపోయింది. సకాలంలో నీటి విడుదల జరిగి ఉంటే మా పంటలు చేతికొచ్చేవి.
-తేజావత్ లక్పతి, రైతు, అంజనాపురం
దోమలవాగు చెరువు ఆయకట్టులోని పోలవరంలో ఎకరంన్నర వరి పొలం సాగు చేశాను. పంట పొట్ట దశకు చేరుకున్న సమయంలో నీటితడులు అందకపోవడంతో కళ్లెదుటే పంటంతా ఎండిపోయింది. అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టాను. చివరకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఆ పంటను చూసి బోరున విలపించడమే తప్ప చేసేది ఏమీలేదు. రైతుల అభ్యర్థనను ముందుగానే పట్టించుకొని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు.
-బానోత్ వనిత, రైతు, పోలవరం