మధిర, మార్చి 22 : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల పంట పొలాలకు నీరందక ఎండిపోతున్నాయని, సాగు భూములు నెర్రెలు వారుతున్నాయని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తొండల గోపవరం రెవెన్యూ పరిధిలోని సాయిపురం గ్రామంలో సాగునీరందక నెర్రెలు వారిన పొలాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. కట్టలేరు పరిధిలో సుమారు 70 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు రైతులు ఆయనకు తెలిపారు.
వరి పంట గింజపట్టే దశలో సాగునీరు అందకపోవడంతో గ్రామంలోని బోరుకు రెండు కిలోమీటర్ల మేర పైపులైన్ వేసుకుని పంటలను కాపాడుకుంటున్నామని పేర్కొన్నారు. అనంతరం కమల్‌రాజు మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులు కట్టలేరుపై ఆధారపడి వరి సాగు చేస్తున్నారని, కానీ.. అందులో నీరు లేకపోవడంతో పంటలకు నీరందడం లేదన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కట్టలేరుకు సాగర్ జలాలను లంకాసాగర్ ద్వారా విడుదల చేయడం వల్ల సాగునీటికి ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. కట్టలేరుపై చెక్‌డ్యాం నిర్మించడం వల్ల రెండు కిలోమీటర్ల మేర నీటి నిల్వ ఉండేదన్నారు. ఆ నీటితోనే రైతులు పంటలు పండించుకునేవారని తెలిపారు.
ఇప్పటి అధికారుల నిర్లక్ష్యం వల్ల సాగర్ నీటిని సరఫరా చేయకపోవడంతో కట్టలేరు ఎండిపోయిందన్నారు. తన నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నా డిప్యూటీ సీఎం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మారెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, మాజీ వైస్ చైర్మన్ కటికల సత్యనారాయణరెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బొగ్గుల భాసర్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు బొగ్గుల వీరారెడ్డి, వంకాయలపాటి నాగేశ్వరరావు, తుమ్మ వీరారెడ్డి, చంద్రారెడ్డి, పింగళి సూర్యప్రకాశ్, రామిరెడ్డి, నరెడ్ల బాలకృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు యన్నంశెట్టి అప్పారావు, సయ్యద్ ఇక్బాల్, పల్లిపాటి కోటేశ్వరరావు, వీరంశెట్టి సీతారామయ్య పాల్గొన్నారు.