అశ్వారావుపేట టౌన్/ అశ్వారావుపేట రూరల్, ఏప్రిల్ 11: భారీ ఈదురుగాలులు, అకాల వర్షం అన్నదాతకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. మండలంలో గురువారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షంతో మామిడి, అరటి, జీడిమామిడి తోటలతోపాటు వరి, మిర్చి, పొగాకు పంటలకు భారీ నష్టం వాటిల్లింది. భారీ వృక్షాలు, కొబ్బరి, అరటి తోటలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు గంటలతరబడి అంతరాయం ఏర్పడడంతో ప్రజలు రాత్రంతా తీవ్ర ఇబ్బందులుపడ్డారు.
శివయ్యగారి బజారులో చిరంజీవి ఇంటి వద్ద కొబ్బరి చెట్లు విరిగిపడడంతో ప్రహరీ ధ్వంసమైంది. మద్దిరావమ్మ సెంటర్లోని ఆరేపల్లి లక్ష్మణరావు ఇంటిపై భారీ మామిడి చెట్లు విరిగిపడడంతో ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నది. తూర్పు బజారులో చెట్లు విరిగిపడ్డాయి. బస్టాండ్ వెనుక ఉన్న కట్టా హనుమంతురావు, నాగేశ్వరరావులకు చెందిన అరటి తోట సుమారు రెండు ఎకరాల మేర నేలవాలింది.
వినాయకపురం, మల్లాయిగూడెం, నారాయణపురం, అనంతారం, మామిళ్లవారిగూడెం, తిరుమలకుంట, సున్నంబట్టి తదితర గ్రామాల్లో ఈదురుగాలులకు మామిడి కాయలు నేలరాలాయి. దీంతో తోటలు కౌలుకు తీసుకున్న వ్యాపారులు, సాగు రైతులు తీవ్రంగా నష్టపోయారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరించకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడ్డారు. మరమ్మతు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇళ్లు, పంటలు దెబ్బతిన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు, రైతులు కోరారు.