ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఆగస్టు 11 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పంటల రుణమాఫీ ప్రక్రియ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కోతలు, కొర్రీలతో కొనసాగుతోంది. పంట రుణాలు తీసుకున్న ప్రతి రైతుకూ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల తరువాత రుణమాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టినప్పటికీ అన్నదాతలకు అనేక కొర్రీలు పెడుతోంది. దీంతో వేలాదిమంది రైతులు రుణమాఫీకి దూరమవుతున్నారు.
ఫలితంగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. ఈక్రమంలో నష్టనివారణకు దిగిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హత కలిగినప్పటికీ రుణమాఫీ రాని రైతులు టోల్‌ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొంది. గ్రామ, మండలస్థాయిలోనూ ఏఈవోలు, ఏవోల ద్వారా అర్జీలను స్వీకరిస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు సుమారు 7,400 ఫిర్యాదులు వచ్చినట్లు సదరు అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు మరో 2 వేలకు పైగా ప్రజావాణిలో రైతులు అర్జీలు పెట్టుకున్నారు.
రేషన్‌కార్డులో ఇద్దరు పేర్లు ఉంటే ఒక్కరికే రుణమాఫీ వచ్చిందని, ఆధార్‌కార్డు నెంబర్ తప్పుకావడం, ఒకరి ఆధార్ నెంబర్ మరొకరి పేరుపై రావడం, రెండు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం ద్వారా సాంకేతిక సమస్య తలెత్తడం వంటి పలు కారణాలతో రుణమాఫీకి రైతులు దూరమవుతున్నట్లు తెలుస్తోంది. పంటల రుణమాఫీకి తమకు అర్హత ఉన్నప్పటికీ జాబితాలో తమ పేరు రాకపోవడానికి గల కారణాల కోసం బ్యాంకులు, సొసైటీల చుట్టూ రైతులు తిరుగుతున్నారు. ఒకవైపు గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరుగా ఉన్నప్పటికీ పనులు పక్కన పెట్టి మరీ రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతుండడం గమనార్హం.
రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు రెండు దఫాలుగా ప్రభుత్వం రుణమాఫీ నిధులను విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలో తొలివిడతలో రూ.లక్షలోపు రుణాలున్న 57,857 మంది రైతులకు రూ.258.25 కోట్లు, రెండోవిడతలో రూ.లక్ష నుంచి 1.50 లక్షల్లోపు రుణాలున్న 33,942 మంది రైతులకు రూ.262.50 కోట్లు కలిపి రెండు విడతల్లో 91,799 మంది రైతులకు రూ.520.75 కోట్లు అందజేసింది. అయితే అర్హత ఉన్నప్పటికీ చిన్నపాటి సాంకేతిక కారణాల వల్ల పథకానికి దూరమైన రైతులు ఇంచుమించు జిల్లావ్యాప్తంగా 10 నుంచి 15 వేల వరకు ఉండవచ్చని అంచనా.
అర్హత కలిగిన రైతులకు రుణమాఫీ వర్తించేందుకు గాను ఎడిట్ ఆప్షన్ వ్యవసాయశాఖ అధికారులకు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కనీసం ఆధార్‌కార్డు నెంబర్‌ను సరిచేసే ఆప్షన్ కూడా లేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అర్జీలను తీసుకోవడం వరకే తమ బాధ్యత అంటూ బదులిస్తున్నారు.
రుణమాఫీపై రైతుల సందేహాల నివృత్తికి ప్రభుత్వం భద్రాద్రి జిల్లాలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఈ జిల్లాలో ఇప్పటివరకు 660 మంది రైతులు తమ ఫిర్యాదులను అందజేశారు. ప్రత్యేక ఫార్మాట్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. మండలాల్లో ఏవో, ఏఈవోలు, డివిజన్ స్థాయిలో ఏడీఏలు, జిల్లాస్థాయిలో డీఏవో పరిధిలో ఫిర్యాదుల సెల్‌ను ఏర్పాటు చేశారు.
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 660 మంది రైతులు రుణమాఫీ రాలేదని ఫిర్యాదు చేశారు. మిగతా రైతులు మూడో జాబితాలో పేర్లు రాకపోతే ఫిర్యాదు చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఎక్కువగా రేషన్ కార్డుల్లో పేర్లు లేకపోవడం వల్ల రుణమాఫీ కాలేదని తెలిసింది. కొందరికి ఆధార్ కార్డులో ఉన్న నెంబర్‌కు అందులో ఉన్న పేరు తప్పుగా పడడం వల్ల కూడా రుణమాఫీ జరగలేదని తెలుస్తోంది. ఇంకా ఆధార్ కార్డులో పేర్లు లేకపోవడం, రేషన్ కార్డులు కొత్తవి ఇవ్వకపోవడం వల్ల కూడా రైతుల పేర్లు రుణమాఫీలో లేనట్లుగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక మూడో జాబితా ఎలా ఉంటుందో చూడాలి.