అశ్వారావుపేట, సెప్టెంబర్ 8: ‘పెదవాగు’ వరద నష్ట పరిహారం చెల్లింపుల్లో అన్నదాతలతో అధికారులు పరిహాసమాడినట్లు కన్పిస్తోంది. వరద ధాటికి పంటంతా కొట్టుకుపోయి, పొలమంతా రాళ్లు చేరి, ఇసుక మేటలు వేసిన అన్నదాతలకు అర్హుల జాబితాలో అధికారులు మొండిచేయి చూపారు. సెంటు కూడా భూమి లేని వారికి, మరీ తక్కువ విస్తీర్ణంలో పొలం ఉన్న వారికి అగ్రతాంబూలం వేశారు.
ఇంకో అడుగు ముందుకేసి ఒకే కుటుంబం పేరుతో ఏకంగా 14 మందికిపైగా పరిహారం చెల్లించారు. అంతేకాకుండా స్థానికంగా నివాసం ఉంటూ ఏపీలో భూములున్న వారికి కూడా పరిహారం మంజూరు చేశారు. ఈ అక్రమాల వెనుక ఒక ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి ఉన్నాడని, రాజకీయంగా అధికారులను ప్రలోభాలకు గురిచేశాడని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు బాధిత రైతులు, గ్రామ పెద్దలు సిద్ధమవుతున్నారు.
గత జూలై నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లిలోని పెదవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడిన విషయం విదితమే. దీంతో ప్రాజెక్టులోని వరద దిగువనున్న పంటల పొలాలను ముంచెత్తింది. పంట పొలాలన్నీ కొట్టుకుయాయి. ఆయా పంట చేలలోకి బండరాళ్లు వచ్చి పడ్డాయి. ఇసుక మేటలు వేసింది. దీంతో ఆయా రైతులందరూ పంటలు కోల్పోయి, ఇసుక మేటలు వేసి భారీగా నష్టపోయారు. ఈ క్రమంలో బాధిత రైతులకు పరిహారం చెల్లిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వ్యవసాయ శాఖతో వివరాలను సేకరించింది.
కానీ ఆ శాఖలోని కొందరు ఉద్యోగులు బాధితులను గుర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అనర్హులను జాబితాలో చేర్చారు. బాధితులను విస్మరించారు. సర్వే పూర్తయ్యాక అర్హుల జాబితాను కనీసం ఏ కార్యాలయంలోనూ ప్రదర్శించలేదు. అధికారులు సర్వే చేయడం, ఆ జాబితాను ప్రభుత్వానికి పంపడం వంటివి పూర్తయ్యాయి. తీరా పరిహారం చెల్లించిన తరువాత అసలు బాగోతం బయటపడింది. పరిహారపు జాబితాలో అనర్హులు ఎక్కువగా ఉండడం, అసలు భూమి లేని, పట్టాలు లేని వారి పేర్లు ఆ జాబితాలో ఉండడంతో గ్రామస్తులు ఒక్కసారిగా విస్మయం వ్యక్తం చేశారు. పట్టాలు లేని వారి పేర్లు, పంటలకు ఎటువంటి నష్టమూ జరగని వారి పేర్లు ఉన్నాయి.
తక్కువ విస్తీర్ణం ఉన్నప్పటికీ వారు ఎక్కువ విస్తీరంలో నష్టపోయారంటూ నమోదు చేసి భారీగా పరిహారాన్ని దారిమళ్లించిన అంశాలు బయటపడ్డాయి. అంతేకాకుండా గుమ్మడవల్లి పంచాయతీలో ముగ్గురికి ఆంధ్రప్రదేశ్‌లోని మేడిపల్లి పంచాయతీ పరిధిలో భూములున్నాయి. వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి పరిహారం మంజూరైంది. ఒక్క గుమ్మడవల్లి పంచాయతీలోనే రూ.లక్షల మేర పరిహారపు నిధులు స్వాహా అయ్యాయి. కానీ అర్హులకు న్యాయం జరగలేదు. అప్పటికే అటు పంటలు నష్టపోయిన రైతులు.. ఇటు పరిహారానికీ నోచుకోక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిహరం జాబితా రూపకల్పన వెనుక ఓ ఎమ్మెల్యే పీవో కీలకంగా వ్యవహరించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిహారం సొమ్మును ఎక్కువగా తన బంధుగణానికి మంజూరు చేయించుకున్నాడని, అధికారులను ప్రలోభాలకు గురిచేశాడనే వాదనలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 14 మందికి, తనకు పరిచయమున్న ఇతరులకూ భారీగా ప్రజాధనాన్ని పంచిపెట్టాడు. తీరా విషయం బయటకు రావడంతో ఈ వ్యవహారాన్ని దాచిపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.
నాకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి వచ్చింది. పెదవాగు వరదలతో మా పొలంలోకి రాళ్లు వచ్చిపడ్డాయి. ఇసుక మేటలు వేసింది. వీటిని తొలిగించేందుకు అధిక మొత్తంలో ఖర్చవుతుంది. నేను ఇంతలా నష్టపోతే.. ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం నాకు అందలేదు.
-కురేశ్, బాధిత రైతు, గుమ్మడవల్లి
నేను బాధ్యతలు పర్యవేక్షిస్తున్న సమయంలో వరద పరిహారం మంజూరు కాలేదు. నేను ఇటీవలే బదిలీపై వచ్చాను. పరిహారం చెల్లింపులో అక్రమాలపై ఎటువంటి ఫిర్యాదులు అందలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తాను.
-శివ రామ్‌ప్రసాద్, ఏవో, అశ్వారావుపేట
పెదవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోయిన తర్వాత వరద ఉధృతికి నా పొలమంతా ఇసుక మేటలు వేసింది. వాటిని తొలిగించడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను. ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుందని ఆశించా. కానీ మంజూరు కాలేదు.
-వీరంకి అనిల్, బాధిత రైతు, గుమ్మడవల్లి