ఖమ్మం, ఆగస్టు 13: ఖమ్మం జిల్లాకు ముగ్గురు సీనియర్ మంత్రులున్నా ప్రయోజనం లేదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు విమర్శించారు. వారి నిర్లక్ష్యంతోనే జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయని స్పష్టం చేశారు. వారి పట్టింపులేనితనంతో ఖమ్మం జిల్లాను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని విమర్శించారు. సాక్షాత్తూ మంత్రుల కాలనీల్లోనే దొంగలు మారణాయుధాలతో స్వైరవిహారం చేస్తుండడం ఆ అమాత్యులకే సిగ్గుచేటని అన్నారు. దీంతో జిల్లాలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి బ్యాచ్‌ల అరాచకాలు, దొంగల దోపిడీలు, జూదరుల పేకాటలు, ఇతర అసాంఘిక చర్యలు వంటి వాటితో జిల్లా ప్రజలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులకు అభివృద్ధి చేతకాదని విమర్శించారు. వారి పట్టింపులేనితనం కారణంగానే గతంలో ఎప్పుడూలేని విధంగా జిల్లాలో ఇప్పుడు శాంతిభద్రతలు ప్రమాదంలో పడ్డాయని ఆరోపించారు. ప్రజలు కూడా భయంభయంగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ఈ ముగ్గురు మంత్రులూ సిగ్గుతోనే తలవంచుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని విమర్శించారు. మొన్న సత్తుపల్లిలో సింగరేణి ఉద్యోగులు నివాసాల్లో దోపిడీ జరిగిందని, నిన్న ఖమ్మం బొమ్మరిల్లు అపార్ట్‌మెంట్స్‌లో ఓ కుటుంబం వారి జీవితాంతం కష్టించి సంపాదించుకున్న సొమ్మును దొంగలు దోచుకెళ్లారని గుర్తుచేశారు.
గోపాలపురం ప్రాంతంలో గంజాయి ఆకతాయిల ఆగడాలు, దాడులు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను జిల్లా మంత్రులు పూర్తిగా వారి ప్రొటోకాల్ డ్యూటీలకే వినియోగించుకుంటున్నారని విమర్శించారు. మంత్రులు తమపై అత్యంత దారుణమైన భాషను ఉపయోగిస్తున్నారని అధికారులు, పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పోలీసులు కూడా నాకాబందీలు, కార్డన్ సెర్చ్‌లు నిర్వహించడం లేదని ఆరోపించారు. సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని అన్నారు. ఇక పోలీసు స్టేషన్లయితే సెటిల్మెంట్లకు, రియల్ ఎస్టేట్ పంచాయితీలకు అడ్డాలుగా మారాయని ఆరోపించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, పగడాల నాగరాజు, బెల్లం వేణు, బ్రహ్మయ్య, మక్బూల్, ఖమర్, బిచ్చాల తిరుమలరావు, బొమ్మెర రామ్మూర్తి, వెంకటరమణ, పగడాల నరేందర్, సతీశ్, బలుసు మురళీకృష్ణ, మహ్మద్ రఫీ, చీకటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.