ఖమ్మం అర్బన్, ఏప్రిల్ 1 : మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో గల ఆర్అండ్బీ విభాగానికి చెందిన సీపీఎస్ ఉద్యోగులు బుధవారం ప్ల కార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ మాట్లాడుతూ ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిందని, ఆ హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిటీ గడువు ముగిసి కూడా మూడేళ్లు గడిచిందని, ఈ క్రమంలో ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన పీఆర్సీని అమలు చేయాలని కోరారు. సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలను ఒకేసారి చెల్లించాల్సింది పోయి వాయిదా పద్ధతిలో చెల్లించడం దౌర్భాగ్యమన్నారు. కార్యక్రమంలో మహిళా ఉపాధ్యక్షురాలు శ్వేత, రమణ, రవి, విజయ్, సాయి, కృష్ణభాను, శ్రీకాంత్, గోపి, కిరణ్, ఉదయ్, నరసింహారావు, కృష్ణకుమారి, శ్రీలత, అనిత, నస్రత్ బేగం, సరస్వతి, లక్ష్మీసాయి తదితరులు పాల్గొన్నారు.