బోనకల్లు, ఆగస్టు 02 : బోనకల్లు మండల కేంద్రంలోని విద్యుత్ సేవా కేంద్రం వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వైరా ఏడిఈ పోతగాని కిరణకుమార్ వైఖరికి నిరసనగా గోవిందాపురం గ్రామస్తులు శనివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాదినేని వీరభద్రరావు, వేడునూతల లక్ష్మణరావు మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం రైస్ మిల్లు, స్థానికుల కోసం విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయగా ఆ దిమ్మె శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యుత్ అధికారులు పది రోజుల క్రితం పునర్మించినట్లు తెలిపారు. అయితే కొత్తగా నిర్మించిన దిమ్మెను తొలగించి రోడ్డు పక్కన మరో స్థలంలో ట్రాన్స్ఫార్మర్ కోసం దిమ్మె నిర్మించాలని కాంగ్రెస్ నాయకుడు ఉమ్మనేని బాబు సూచించడం దారుణమన్నారు.
ఆయన సూచనకు విద్యుత్ అధికారులు సరేననడం దారుణమన్నారు. ఆయన చెప్పిన విధంగా దిమ్మె ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. కావునా విద్యుత్ శాఖ వారు నిర్మించిన దిమ్మెపైనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ సునీత, నల్లమోతు వాణి, కొమ్ము కమలమ్మ, గడ్డం విజయ, చింతలచెరువు మంగమ్మ, గోళ్ల అచ్చమ్మ, నల్లమోతు వెంకట నరసమ్మ, ద్రోనోజుల వెంకటలక్ష్మి, తమ్మారపు లక్ష్మణరావు, కారంగుల చంద్రయ్య, పసుపులేటి నరేశ్, శ్రీనివాసరావు, కళ్యాణపు బుచ్చయ్య, కోట కాటయ్య, పుచ్చకాయల వలరాజు పాల్గొన్నారు.